iDreamPost
android-app
ios-app

కేంద్ర బడ్జెట్ 2022-23: నదుల అనుసంధానంపై కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

  • Published Feb 01, 2022 | 6:48 AM Updated Updated Feb 01, 2022 | 6:48 AM
కేంద్ర బడ్జెట్ 2022-23: నదుల అనుసంధానంపై కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

రాబోయే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వ్యవసాయరంగం, నీటిపారుదల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రైతాంగాన్ని సంతృప్తి పరిచేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం సంకేతాలు పంపించింది. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించటానికి వీలుగా.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర ప్యాకేజీలను ప్రవేశపెడతామన్నారు. వాటితో పాటుగా నదుల అనుసంధానం గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వాటికి ప్రాధాన్యతనిస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణా- గోదావరి నదులతో పాటుగా పెన్నా- కావేరీ నదుల అనుసంధానం కూడా చేస్తామని తెలిపారు.

చిన్న రైతులు, వ్యాపారుల కోసం రైల్వేలలో సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. స్థానిక ఉత్పత్తుల సప్లై చైన్‌కు సాయం చేయటానికి ‘ఒక స్టేషన్ – ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రజా రవాణాకు, రైల్వే స్టేషన్లకు మధ్య మల్టీమోడల్ అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పీఎం గతి శక్తి కింద రాబోయే కొన్నేళ్లలో 100 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తామని నిర్మల తన ప్రసంగంలో తెలిపారు.పీఎం గతి శక్తి పథకాన్ని వేగవంతం చేయటానికి ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు అందించటానికి, వేగవంతంగా అమలు చేసేయటానికి ప్రభుత్వం వినూత్న మార్గాలను ప్రోత్సహిస్తుందని నిర్మల చెప్పారు. వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

Also Read : సీలేరు… సరిలేరు నీ కెవ్వరూ…

మేకిన్ ఇండియా ద్వారా ఉపాధి కల్పన చేస్తామని అన్నారు. ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 2022-23లో నేషనల్ హైవే నెట్‌వర్క్‌ను 25,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు. వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయటం.. కోవిడ్ మహమ్మారి ప్రస్తుత వేవ్‌ను దేశవ్యాప్తంగా బలంగా ఎదుర్కోవటం అందరికీ కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించటానికి చేపట్టిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహ పథకానికి (పీఎల్ఐ స్కీమ్‌కు) అద్భుత స్పందన లభించిందన్నారు. దీనిద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించే అవకాశముందని, రాబోయే సంవత్సరాల్లో అదనంగా మరో 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్పారు.

కార్పోరేట్, సహకార రంగాలకు పన్ను రాయితీలు ప్రకటించారు. కో ఆపరేటివ్ సొసైటీలకు పన్నుల శాతాన్ని 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ లో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో సహకార రంగంలో రైతాంగానికి లభించిన భారీ ఊరటగా దానిని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ పీ ఎస్ విధానంలో 14 శాతం వరకూ పన్ను మినహాయింపుని ప్రకటించారు.

Also Read : బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

స్టార్టప్ సంస్థలకు పన్ను రాయితీలను మరో ఏడాది పొడిగించారు. క్రిప్టో కరెన్సీ తరహా డిజిటల్, వర్చువల్ ఆస్తులపై 30 శాతం పన్ను కొనసాగుతుందని తెలిపారు. ఇక సాధారణ మధ్య తరగతికి మాత్రం మరోసారి నిరాశ ఎదురయ్యింది. ఆదాయపు పన్ను శ్లాబులు మార్చడం గానీ, పన్ను తగ్గుదలకు గానీ కేంద్రం సిద్ధం కాలేదు. దాంతో పన్ను రాయితీలు ఆశించిన వారికి ఆశాభంగమయ్యింది.