iDreamPost
iDreamPost
ప్రజలే తమను పాలించే ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రత్యేకత. మన రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు ప్రకారం పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఐదేళ్లకోసారి నిర్వహించే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను గెలిపించుకుని చట్టసభలకు పంపాల్సి ఉంటుంది. అర్హులైన ప్రతి భారత పౌరుడికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కు ప్రకారమే రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్రంగా కూడా చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఎక్కువమంది అభ్యర్థులు రంగంలో ఉన్నప్పుడు ఏర్పాట్లు చేయడం ఎన్నికల అధికారులకు కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు.
2019 ఎన్నికల్లో తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ స్థానంలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పుడే అమ్మో.. ఇంతమందా అనుకున్నారు. ఈవీఎంలు, ఇతరత్రా ఏర్పాట్లు చేయడానికి అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది వెయ్యిమందికి పైగా అభ్యర్థుల్లో పోటీలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి!.. అసలు అలాంటి సందర్భం ఒకటి ఉందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. 1996లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి అరుదైన పోటీ చోటు చేసుకుంది. మొదకురిచి అనే నియోజకవర్గంలో ఏకంగా 1033 మంది బరిలో నిలిచి ఎన్నికల అధికారులకు చుక్కలు చూపించారు.
ఎందుకు అంతమంది పోటీ చేశారు?
కోయంబత్తూరు జిల్లా మొదకురిచి నియోజకవర్గ రైతులు తమ సమస్యల కోసం చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనందుకు నిరసనగా మూకుమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 1016 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులు వేసిన వాటితో కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య 1088 కు చేరింది. దాంతో బెంబేలెత్తిన ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. పరిశీలనలో 42 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, మరో 13 మంది ఉపసంహరించుకున్నారు. దాంతో చివరకు 1033 మంది పోటీలో మిగిలారు.
పోలింగ్ నెలరోజులు వాయిదా
ఎన్నడూ.. ఎక్కడా లేనివిధంగా 1033 మంది పోటీ చేస్తుండటంతో ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాలుగా మారింది. ఆ ఒక్క నియోజకవర్గం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సివచ్చింది. అదే కారణంతో అక్కడ పోలింగ్ నెల రోజులు వాయిదా వేశారు. అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించడం పెద్ద సమస్యగా మారింది. ఇక అప్పట్లో బ్యాలెట్ పేపర్ విధానం ఉండేది. 1033 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులు పట్టేలా న్యూస్ పేపర్ సైజులో ఒకటికంటే ఎక్కువ పేజీలతో బ్యాలెట్ పత్రాలు ముద్రించాల్సి వచ్చింది. అలాగే బ్యాలెట్ బాక్స్ లను కూడా నాలుగు అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక పోలింగ్ రోజు ఓటర్లు అంత పెద్ద బ్యాలెట్ పేపర్ లో తమ అభ్యర్థిని గుర్తించి ఓటు వేసేందుకు వీలు కల్పిస్తూ పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచారు.
ముగ్గురు తప్ప అందరికి డిపాజిట్లు గల్లంతు
ఇంత క్లిష్టంగా సాగిన ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి సుబ్బలక్ష్మి జగదీశన్ ఏడీఎంకే అభ్యర్థి కిట్టుస్వామిపై గెలుపొందారు. వీరితోపాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి మినహా మిగిలిన 1030 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పోటీచేసిన వారిలో 88 మందికి ఒక్క ఓటు కూడా లభించకపోవడం ఈ ఎన్నికల్లో మరో విచిత్రం. 158 మందికి ఒక్క ఓటు చొప్పున లభించాయి.
1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ ఎంపీ స్థానంలో నీటిసమస్య పరిష్కారం కోరుతూ 480 మంది పోటీలో నిలిచారు. బెల్గాం ను మహారాష్ట్రలో కలపాలన్న డిమాండ్ తో ఆ నియోజకవర్గంలో 456 మంది ఎన్నికల బరిలో నిలవడం విశేషం. కాగా అప్పట్లో ఎన్నికల డిపాజిట్లు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణంగా అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో ఎంపీ స్థానంలో పోటీకి జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ ,ఎస్టీలు రూ.250 చెల్లించాల్సి ఉండేది. అసెంబ్లీ నియోజకవర్గానికైతే జనరల్ అభ్యర్థులు రూ.250, ఎస్సీ ,ఎస్టీలు రూ.125 చెల్లించాల్సి ఉండేది. అప్పటి అనుభవం తర్వాతే ఎన్నికల డిపాజిట్లు భారీగా పెంచారు.