iDreamPost
iDreamPost
చిన్న పాత్రలతో కెరీర్ ని మొదలుపెట్టి హీరోగా ఎదిగి పెళ్లి సందడితో మొదటి బ్రేక్ ని, మహాత్మతో వంద సినిమాలను పూర్తి చేసుకున్న శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న పరమేశ్వరరావు గారి వయసు 70 సంవత్సరాలు. 1948 మార్చి 16 ఆయన జన్మదినం. కృష్ణాజిల్లా మేకావారిపాలెం స్వస్థలం. కర్ణాటకలోని బసవనపాలెంకు వలసవెళ్లిన ఆయన కుటుంబం శ్రీకాంత్ నటుడిగా ఎదిగే దాకా అక్కడే స్థిరపడింది.
భార్య పేరు ఝాన్సీ కాగా ఇద్దరు కుమారుల్లో మొదటివాడు శ్రీకాంత్ కాగా రెండో అబ్బాయి అనిల్. ఇతను కూడా హీరోగా ఒక సినిమా చేసి అది ఫ్లాప్ కావడంతో ఇతర రంగాల్లోకి వెళ్ళిపోయారు. పెద్ద కోడలు ఊహ సినీ రంగం నుండే రాగా మనవడు రోషన్ కొన్నేళ్ళ క్రితం నాగార్జున నిర్మల కాన్వెంట్ తో డెబ్యు చేశాడు. ఇంకో సినిమా నిర్మాణంలో ఉంది. పరమేశ్వర్ రావు మృతి పట్ల పరిశ్రమ పెద్దలతో పాటు శ్రీకాంత్ స్నేహితులు, తోటి నటీనటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పలు సందర్భాలలో తండ్రి తనకు ఎంత మద్దతు ఇచ్చింది ప్రత్యేకంగా చెప్పుకున్న శ్రీకాంత్ కు ఇప్పుడీ లోటు ఎవరు తీర్చలేనిది. కాసేపటి క్రితం శ్రీకాంత్ అన్నయ్యగా పిలుచుకునే చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి సానుభూతి ప్రకటించారు. మరికొందరు ప్రముఖుల రాకతో శ్రీకాంత్ ఇంట్లో గంభీరవాతావరణంతో కూడిన సందడి నెలకొంది . నటుడిగానే కాక వ్యక్తిగతంగానూ శ్రీకాంత్ అన్ని వర్గాలతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మహాప్రస్థానంలో పరమేశ్వరరావు గారి అంత్యక్రియలు పూర్తి చేస్తారు.