Idream media
Idream media
కలకత్తాలో పోస్ట్‌మార్టం సహాయకుల ఉద్యోగాలు ఖాళీ పడితే ఇంజనీర్లు, పీజీలు అప్లయ్ చేశారు. దాని అర్హత 8వ తరగతి. అంటే నిరుద్యోగం తీవ్రంగా ఉందా? లేదంటే మన చదువుల స్థాయి పడిపోయిందా? రెండూ అని చెప్పొచ్చు. ఆశ్చర్యం ఏమంటే దీని జీతం 15 వేలే!
ఒకప్పుడు ఈ ఉద్యోగాల్లో ఎవరూ చేరేవాళ్లు కాదు. ఈ పనికి గుండె ధైర్యం కావాలి. శవాల్ని కోసి , కుట్లు వేయాలి. అనాథ శవాలైతే ఖననం చేయాలి. డాక్టర్లు కేవలం పోస్టుమార్టంని పర్యవేక్షిస్తారు. ఆయన చెప్పినట్టు శవాన్ని Open చేయాలి. ముఖ్య భాగాల్ని పరిశీలించి మరణానికి కారణాలను తెలుసుకుంటారు. అంటే సహజ మరణమా, హత్య అనేది పోస్టుమార్టంలో డాక్టర్ తేలుస్తాడు. ఆయన పరిశీలన తర్వాత శవానికి కుట్లు వేసి , దాన్ని బంధువులకు అప్పగించే బాధ్యత ఈ సహాయకులదే.
రుయా ఆస్పత్రిలో ఈ పోస్టులు ఎప్పుడూ ఖాళీగా వుండేవి. ఒకరిద్దరు చేరినా భయపడి పారిపోయే వారు. దాంతో తిరుపతి చుట్టుపక్కలున్న యానాదులు ఈ పని చేసేవాళ్లు. పీకలదాకా చీప్ లిక్కర్ తాగి పనిలోకి దిగేవాళ్లు. వీళ్లని చూస్తే డాక్టర్లు కూడా భయపడేవాళ్లు. కోపం వస్తే మైకంలో నోటికొచ్చినట్టు తిట్టేవాళ్లు. ఒకసారి డాక్టర్ ఏదో తిట్టాడని శవాన్ని మధ్యలో వదిలేసి ఒక యానాది వెళ్లిపోయాడు. వాడిని బుజ్జగించి, బతిమలాడి తీసుకొచ్చారు. వీళ్లకి అవసరమైన డబ్బుని మృతుల బంధువులతో వసూలు చేసేవాళ్లు. గొయ్యి తీసే ఓపిక లేక, అనాథ శవాలను కంప చెట్లలో పడేసి వెళితే కుక్కలు పీక్కు తిన్న సంఘటనలు ఎన్నో. ఈ 20 ఏళ్లలో ఏమైనా మారిందేమో తెలియదు.
ఇక పోలీసులకి కూడా ఈ యానాదులే దిక్కు. దొంగల్ని, అనుమానితుల్ని లాఠీలతో చావబాదుతారు కానీ, పోలీసులకి శవాల్ని చూస్తే ఒళ్లంతా వణుకే, చాలా మందికి దెయ్యాల భయం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ల శవాల్ని చూసి భయంతో తిరుపతి నాలుగ్గాళ్ల మండపం వద్ద తాయిత్తులు కట్టించుకున్న వాళ్లెందెరో! ముఖ్యంగా నీళ్లలో మునిగిన శవాలు ఉబ్బి వికృతంగా మారుతాయి. బావిలో నుంచి కానీ, చెరువుల్లోంచి కానీ వాటిని బయటికి తీసే బాధ్యత యానాదులది. దానికి పోలీసులు డబ్బులిస్తారు. ఆఫ్ బాటిల్ మందు తాగి కానీ ఈ పనికి దిగరు. ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊడిపోయే శవాల్ని ఈత చాపలో చుట్టిపెడితే, దానికి పంచనామాని అధికారులు నిర్వహిస్తారు.
ఒకసారి బావిలో శవాల్ని వెలికితీసే పనిలో యానాదులుండగా విలేకరులంతా వెళ్లాం. SI కొంచెం రుబాబ్ చూపిద్దామని ఒక యానాదిని “అరేయ్ దొంగ నాకొడకా , స్పీడ్‌గా కానియ్యరా పని” అని అరిచాడు. అప్పటికే ఫుల్‌గా తాగి గాలికి తెరచాపలా ఊగుతున్నాడు యానాది. అతనికి మండింది.
“ఎవురుయా దొంగ నా కొడుకు, నువ్వు దొంగ నా కొడుకు, తిరుమల బస్టాండ్‌లో కత్తెరగాళ్లను తెచ్చి స్టేషన్‌లో కొట్టేది కాదయ్యా, నువ్వు మొగోడివైతే ఈ డెడ్‌బాడీని బయటికి ఎల్లగొట్టు” అని చాలెంజ్ విసిరాడు.
SIకి పరువు పోయింది. యానాదిని కొట్టలేడు. కొడితే వదిలేసి వెళ్లిపోతాడు. పురుగులు పట్టిన శవాన్ని బావిలో నుంచి తీయడం వీళ్ల వల్ల కాదు. ఒకవేళ తీసినా 15 రోజులు చలి జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతారు.
కాసింత తిండి కోసం ఈ సంచార జీవులు సమాజానికి చేసిన సేవలు ఎక్కడా లెక్కల్లో వుండవు. పైథాగరస్ సిద్ధాంతం మారకపోవచ్చు. కానీ సామాజిక సిద్ధాంతం మారి తీరాలి. అది రూల్!