iDreamPost
android-app
ios-app

Somu Veerraju, Cheap Liquor – మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమేన‌ట‌..

Somu Veerraju,  Cheap Liquor – మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమేన‌ట‌..

ప్ర‌జాగ్ర‌హ స‌భ‌.. చివ‌రికి ఏపీ బీజేపీపైనే ఆగ్ర‌హం తెచ్చేలా చేసింది. చీఫ్ సోము వీర్రాజు లిక్క‌ర్ వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌తోపాటూ పార్టీని కూడా ఉక్కిరిబిక్క‌రి చేస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పేరును మార్మోగేలా చేయాల‌ని జాతీయ స్థాయి నేత‌ల ఒత్తిడితో స‌భ పెట్టిన వీర్రాజు.. జాతీయ స్థాయిలో హాట్‌ టాపిక్‌గా మారిపోయారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత కేటీఆర్‌, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్ర ట్వీట్లు పెట్టడంతో వీర్రాజుపై జాతీయ స్థాయిలో ట్రోలింగ్‌ నడుస్తోంది. చివ‌ర‌కు బీజేపీ అభిమానులు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌డంతో వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి వీర్రాజు నానా తంటాలు ప‌డుతున్నారు.

అయ్యయ్యో వద్దమ్మా..

‘అయ్యయ్యో వద్దమ్మా…’ అంటూ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న రెడ్‌ లేబుల్‌ టీ ప్రకటన తరహాలోనే సోము వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘ప్రత్యేక హోదా.. అయ్యయ్యో వద్దమ్మా… హోదా ఇవ్వలేంగానీ.. చీప్‌ లిక్కర్‌ రూ.50కే ఇస్తాం.. సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ ఆ ప్రకటనకు సంబంధించిన కాంబో ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

‘ఏపీలో రూ.50కే చీప్‌ లిక్కర్‌ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నారు.. మోదీ-షా ద్వయం ఓట్ల కోసం ఇక చీకుల ఆఫర్‌ కూడా ఇస్తుందేమో’ అంటూ తృణమూల్‌ ఎంపీ మహువా ట్వీట్‌ చేశారు. ‘మన దేశం.. మనం పాటించే ధర్మం.. మన పార్టీ సిద్ధాంతం గురించి చెప్పి ఓట్లు అడగాల్సిన మీరు ఒక హిందూ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎలా ఉండకూడదో ప్రతి కార్యకర్తా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఉంది’ అంటూ ఓ బీజేపీ అభిమాని కిశోర్‌ ఆత్మకూరి ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారంటే.. ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

అర్థం చేసుకోండి.. ఇందుకే అన్నార‌ట‌..

సోష‌ల్ మీడియా ట్రోల్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వీర్రాజు. అందుకే ఆ వ్యాఖ్య‌ల‌పై ఇలా వివ‌ర‌ణ ఇచ్చారు. పేదల కష్టాన్ని దోపిడీ చేస్తున్న జగన్‌ బ్యాచ్‌ తీరును ఎండ గట్టేందుకే చీప్‌ లిక్కర్‌ ధరల గురించి మాట్లాడార‌ట‌. మద్యం సేవించే వాళ్లు రోజూ చేసే రూ.250 ఖర్చులో రూ.200 తగ్గితే ఆ కుటుంబంపై భారం తగ్గి సోదరీమణులకు ప్రతి నెలా రూ.6వేలు ఆదా అవుతుందని నిర్వచ‌నాలు చెప్పారు. మంగళవారం బీజేపీ నిర్వహించిన ప్రజాఆగ్రహ సభలో తాను చేసిన వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలోని పలు పార్టీల నేతల కామెంట్లకు బ‌దులిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మమ్మల్ని జగన్‌ పార్టీ అంటోన్న పయ్యావుల నిజం తెలుసు కోవాలని, 1999లో వాజ్‌పాయ్‌ సానుభూతి.. 2014లో మోదీ క్రేజ్‌ను సొమ్ము చేసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇతర పరిశ్రమల విక్రయంపై పవన్‌ కల్యాణ్‌ పోరాటం చేయాలన్న మాటలో తప్పులేదని స‌ర్దిచెప్పుకున్నారు.