iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు… రెడ్ అలెర్ట్

  • Published Jul 13, 2022 | 7:00 PM Updated Updated Jul 13, 2022 | 7:00 PM
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు… రెడ్ అలెర్ట్

తెలంగాణ‌లో అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, అసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మూడు రోజుల భారీ వ‌ర్షాల‌తో, విద్యాసంస్థ‌ల‌కు మూడు రోజుల సెల‌వులను పొడిగించారు.

తెలంగాణ‌లో ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. గోదావ‌రి భీక‌రంగా ప్ర‌వ‌హిస్తోంది. నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులూ ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం లేదు. భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో మూడు రోజులు రాష్ట్రంలోని చాలాచోట్ల ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల గంట‌ల‌కు 40-50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంద‌ని, రేపు తేలిక‌పాటి నుంచి ఓ మోస్తారు వ‌ర్షాలు కుర‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. ఎట్లుండికూడా చొన్నిచోట్ల వ‌ర్షాలు కురుస్తాయి.

వాయివ్య బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం, ఈరోజు ద‌క్షిణ కోస్తా, ఒడిశా ప‌రిస‌ర ప్రాంతాల‌కు విస్త‌రించింద‌న్న‌ది వాతావ‌ర‌ణ శాఖ మాట‌. అందువ‌ల్ల వ‌చ్చే మూడు రోజులు వ‌ర్షాలు కురుస్తాయి.