iDreamPost
android-app
ios-app

ఆయన ఏ పార్టీలో ఉన్న సొంత జిల్లాలో అసంతృప్తి తప్పట్లేదు

ఆయన ఏ పార్టీలో ఉన్న సొంత జిల్లాలో అసంతృప్తి తప్పట్లేదు

తెలంగాణ బీజేపీలో కీలకంగా మారి చ‌క్రం తిప్పాల‌నుకుంటున్న మాజీ ఎంపీ వివేక్ కు షాక్ లు మీద షాక్ లు త‌గులుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుప‌డుతూ బీజేపీలో ఎద‌గాల‌నుకుంటున్న ఆయ‌న చుట్టూ అసంతృప్త జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. త‌మ‌ను ప‌ట్టించుకోకుండా, వివేక్ దూకుడుగా వెళ్తున్నారంటూ ప‌లువురు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌కు త‌మ అసంతృప్తి తెలిసేలా తీర్మానాలు, స‌మావేశాలు పెడుతున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ పార్టీలోకి వ‌స్తున్నార‌ని జోష్ తో ఉన్న రాష్ట్ర నాయ‌క‌త్వానికి పెద్దపల్లి బీజేపీలో ఏర్ప‌డ్డ ముస‌లం త‌ల‌నొప్పిగా మారింది.

మాజీ ఎంపీ వివేక్ పై అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు దిగారు. ఈ రోజు మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం కానున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అసంతృప్తితో గతంలో జిల్లా అధ్యక్ష పదవీకి సోమారపు రాజీనామా చేయగా.. అధిష్టానం చొరవతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పెద్దపల్లి బిజేపిలో ముసలం ఏర్పడింది. ఇందులో భాగంగానే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అసంతృప్తి నేతలకు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివేక్ పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

త‌న సొంత‌ మీడియా ద్వారా ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల‌కు టార్గెట్ గా మారిన వివేక్.. సొంత పార్టీలోనే అంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోలేక పోతున్నారు. గ‌తంలో కూడా బీజేపీలోని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం వివేక్ తీరుపై గొంతు విప్ప‌గా, పార్టీ జోక్యం చేసుకుని వివాదం స‌ద్దుమ‌ణిగేలా చేసింది. తాజాగా మ‌రోసారి అసంతృప్తులంద‌రూ వివేక్ కు వ్య‌తిరేకంగా జ‌త క‌డుతున్నారు. మ‌రి ఈ ప‌రిణామాల‌పై వివేక్ దృష్టి పెడ‌తారా? పార్టీ అధినాయ‌క‌త్వం రంగ ప్ర‌వేశం చేసి చ‌ర్య‌లు చేప‌డుతుందా చూడాలి.