Idream media
Idream media
కాలం మారినా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డ వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. హంగూ ఆర్భాటాలకు దూరం. ప్రజా సమస్యలే ఆయన కథా వస్తువు. విజయం వరించినా, అపజయం పాలైనా పంథా మార్చుకోని వ్యక్తి. సుదీర్ఘకాలంగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రజలందరికీ సుపరిచితమే. కమ్యూనిస్టు భావాలు కలిగిన ఆయన ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల నేతల గురించి మాట్లాడేది తక్కువే. కానీ ఇటీవలి కాలంలో ఆయన వర్ధమాన రాజకీయ, సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తున్నారు. రైతు చట్టాలు, పరిశ్రమల అమ్మకం వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చేపట్టిన సంక్షేమ పథకాలపై జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
హ్యాట్సాప్ జగన్
ఏపీ సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై పలు సందర్భాల్లో ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. ఏలేరు–తాండవ కాలువల అనుసంధాన పనులకు నిధుల మంజూరుపై తాజాగా మరోసారి ఆయన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏలేరు–తాండవ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు.
ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్‌కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.
ఆంగ్ల మాధ్యమం అద్భుత నిర్ణయం
ఏపీలో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం. గతంలో దీనిపై స్పందించిన నారాయణమూర్తి ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల నిర్ణయాలపై సీఎం జగన్ ను ప్రశంసించారు. ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకు రావడం సీఎం జగన్ గొప్పతనమని పేర్కొన్నారు. పేదలకు ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకతపై త్వరలో సినిమా కూడా తీస్తానని చెప్పారు. తనకు ఎలాంటి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదన్న నారాయణ మూర్తి.., జనం కోసం పనిచేసే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
గతంలో విశాఖపట్నంలో పర్యటించిన నారాయమమూర్తి భారత్ లో ఎక్కడా లేని విధంగా జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. జగన్ హయాంలో ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానన్నారు. సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే నారాయణ మూర్తి ఒక ముఖ్యమంత్రిని ఇంతలా పొగడటం బహుశా ఇదే తొలిసారి అని పరిశీలకులు భావిస్తున్నారు. పాలకులపై విమర్శనాత్మక సినిమాలు తీసే ఆర్.నారాయణ మూర్తి జగన్ ను ప్రశించడంపై వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ రైతు బంధు
తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలపై కూడా పలు సందర్భాల్లో ఆర్. నారాయణమూర్తి స్పందించారు. సీఎం కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఘట్టమని పేర్కొన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయని పనులు కేసీఆర్ చేశాడన్నారు. ముఖ్యంగా రైతుబంధు కార్యక్రమం ఎంతో గొప్ప పథకమని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కూడా కేసీఆర్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.
పంచ భూతాలనూ అమ్మేస్తారు..
కేంద్రం ఇటీవల తీసుకుంటున్న పలు నిర్ణయాలపై నారాయణమూర్తి పెదవి విరిచారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ చేతుల్లో పెట్టడానికే కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. రైతుల ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరించటం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచ భూతాలను కూడా అమ్ముకునే విధంగా చర్యలు చేపడుతుందని ఆర్.నారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి అందరూ మద్దతు ప్రకటించాలని ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు.
అదంతా బూటకం
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండోసారి వ్యాప్తి చెందటం అనేది పూర్తిగా బూటకమని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో హాస్యానందం సంస్థ ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కరోనా రెండోసారి వ్యాప్తి అంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు తయారు చేసే శానిటైజర్లు, మాస్క్‌లు, ఇతర మెడికల్ వస్తువులు అమ్ముకొని సొమ్ము చేసుకోవటానికే ఈ ఎత్తుగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులు మాత్రం వేల కోట్ల రూపాయిలు దండుకున్నాయని దుయ్యబట్టారు. ఇలా ఇటీవలి కాలంలో తరచూ ఆయా ఆంశాలపై స్పందిస్తున్నారు ఆర్. నారాయణమూర్తి. దీంతో త్వరలో ఆయన రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.