Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లోని రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల భారీ స్థాయిలో అవినీతి బయటపడింది. నకిలీ చలాన్ల ద్వారా కొందరు అక్రమార్జనకు తెర తీశారు. ఏసీబీ దాడులు చేస్తే కానీ ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో లేవనెత్తారు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా ఆ సమావేశం జరిగిన తీరును పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అసలు ఏపీలో అవినీతికి అడ్డుకట్టపడిందా, గతానికి, ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తోందా.. అని గమనిస్తే ఆసక్తికర విషయాలే వెలుగులోకి వస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వందే అవ్వదన్న అపకీర్తి ఎప్పటి నుంచో ఉంది. చాలా సందర్భాల్లో అది వాస్తవమని తేలింది కూడా. రేషన్ కార్డు నుంచి ఏదైనా ధ్రువపత్రం కావాలన్నా రోజుల తరబడి తిరగడం లేదా, కొందరికి లంచం ఇస్తే కానీ త్వరగా పూర్తి కావడం అంటూ ఉండేది కాదు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అవినీతి అడ్డుకట్టకు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రేషన్ కార్డు నుంచి ఇళ్ల స్థలాల దాకా, ధ్రువీకరణ పత్రాల నుంచి ఇసుక బుకింగ్ దాకా ప్రతీదీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే ప్రజలకు అందుతున్నాయి. అవినీతి నిరోధానికి ఏపీలో ఒక నిర్దిష్ట విధానం అవలంబిస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావాలని జగన్ ఆదేశాలతో ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.
అవినీతిపై ఫిర్యాదులు చేస్తూ వచ్చే కాల్స్‌పై దృష్టి పెట్టేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఈ ఫిర్యాదుల పట్ల అధికారులు సొంతంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్య క్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి కలిగేలా చేయడం కలెక్టర్లు, జేసీల బాధ్యత అని జగన్ ఆదేశించారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనిపించేలా ప్రదర్శిస్తున్నారు. ఏ ఒక్క ఫిర్యాదు అందినా వెంటనే యంత్రాంగం స్పందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఎక్కడైనా అవినీతి జరిగినట్లు వెలుగులోకి వస్తే.. నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగుతున్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన అవినీతిపై జగన్ స్పందిస్తూ ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేదు.. ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా.. అన్న విషయం ఎందుకు పరిశీలించడం లేదు.. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేశామని వివరించారు. కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని చెల్లింపుల ప్రక్రియను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను నిశితంగా గమనించామని, అవినీతికి చోటు లేకుండా పూర్తి స్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ సేవ’ల్లో పరిస్థితులను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు.
ఏదేమైనా గతంతో పోల్చుకుంటే, ఏపీలో అవినీతి తగ్గిందన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకమైన సేవలు అందుతుండడం, అవినీతి నివారణను జగన్ సీరియస్ గా తీసుకోవడం కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రేషన్ కార్డు కావాలంటేనే చాలా సందర్భాల్లో లంచం ఇచ్చుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలను రూపాయి వెచ్చించకుండా లక్షలాది మంది పేదలు పొందారనేది వాస్తవం. దీన్ని బట్టే ఏపీలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని అర్థం అవుతోంది.