iDreamPost
android-app
ios-app

విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం పవన్‌ గాలికొదిలేశారా?

  • Published Feb 15, 2022 | 8:12 AM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం  పవన్‌ గాలికొదిలేశారా?

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా అడ్డుకోవడానికి కార్మికులతో కలసి పోరాడతానన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజులుగా ఆ విషయంపై స్పందించడం లేదు. ఈ నెల 20వ తేదీన నరసాపురంలో మత్స్యకారుల సమస్యలపై పోరాడటాకి వస్తానంటున్న పవన్ ఉక్కు పరిరక్షణకు కూడా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు, కార్మికులు కోరుతున్నారు.

ఏదీ నాటి ఆవేశం..

2021 అక్టోబర్‌ 31న విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్‌ గేట్‌ వద్ద జరిగిన సభలో ఆయన ఆవేశంగా చేసిన ప్రసంగాన్ని కార్మికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు  రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోగా అఖిలపక్షం ఏర్పాటు చేయకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఎంపీలు మౌనంగా ఉంటే ఏం లాభం. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతామని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రకటించాలి అని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

అఖిలపక్షం డిమాండ్ తోసిపుచ్చిన ప్రభుత్వం..

పవన్‌ డిమాండ్ పై స్పందించిన మంత్రులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే ఉద్యమానికి సంఘీభావం తెలిపామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ కూడా రాశారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రస్తావించిన అంశాన్ని కూడా గుర్తుచేశారు. అయినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ అంశంపై పవన్‌కల్యాణ్‌ తమ ప్రభుత్వానికి డెడ్‌లైన్లు విధించటమేమిటని రాష్ట్ర మంత్రులు ప్రశ్నించారు. ఆయనకు చేతనైతే కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఈ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

పవన్ పై కార్మికుల ఆశలు.

ప్రభుత్వం తన డిమాండ్ ను తోసిపుచ్చాక అంటే డిసెంబర్ 11న ఈ అంశంపై మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ ఒక రోజు దీక్ష చేశారు. ఇక ఆ తర్వాత ఈ విషయంపై స్పందించలేదు. తాము ఉద్యమం ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఇటీవల
జైలు భరో నిరసన వ్యక్తం చేసిన కార్మికులు పవన్ తమ పోరాటానికి కలిసి వస్తారని ఆశిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ స్వయంగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కోరుకుంటున్నారు.

పవన్‌ కేంద్రాన్ని ప్రశ్నిస్తారా?

ఇప్పటివరకు ఈ విషయంపై కేంద్రంలో ఉన్న తన మిత్ర పక్ష బీజేపీ ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించలేదు. అయితే ఆంధ్రుల హక్కుగా, ఒక గర్వంగా భావించే ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు పవన్ ఉద్యమ కార్యాచరణ దిశగా కలిసి అడుగులు వేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. లేక మిత్రపక్షాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎప్పటి లాగే రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ ఉద్యమాన్ని గాలికి వదిలేసి ఊరుకుంటారా? అన్నది కార్మికుల్లో చర్చనీయాంశంగా ఉంది.

Also Read : పవన్ కి ఇప్పుడు మత్స్యకారులు గుర్తుకొచ్చారా..?