Idream media
Idream media
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ లో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ ప్రకటన వెంటనే రేవంత్ నియామకాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఎల్ ఆర్ రాజీనామా చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశాడు. ఇది ఓ వైపు అయితే. మరోవైపు పాత నాయకులు ఘర్ వాపసీ అంటున్నారు.
బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మంగళవారం భేటి అయ్యారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎర్రశేఖర్ గతంలో రాజీనామా చేశారు. బీజేపీలో ఆయన పొసగడం లేదు. దీంతో రేవంత్ రెడ్డితో తాజాగా భేటి కావడం విశేషం. టీఆర్ఎస్ లో చేరిన మాజీ టీడీపీ నేత గండ్ర సత్యనారాయణరావు కూడా ఎర్రశేఖర్ తో కలిసి రేవంత్ రెడ్డితో భేటి అయ్యారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ లో చేరుతానన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో బీజేపీలో చేరతానని, గతంలో ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
బీజేపీలో చేరతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తో కూడా గతంలో భేటీ అయ్యారు. ఇరు నేతల మధ్య నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా డీకే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. త్వరలో తన నిర్ణయాన్ని చెప్తానని డీకే అరుణకు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి తెలిపారు. రాజగోపాల్ జీహెచ్ ఎంసీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరతానని ప్రకటించారు. రాజగోపాల్ అన్న పీసీసీ రేసులో ఉండడంతో కొంత కాలం వేచిచూస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో సీన్ రివర్స్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలిసి బుజ్జగించారు. తనకు అనుకూలంగా మలిచారు. అదే సమయంలో అన్న వెంకటరెడ్డి మాత్రం ఇంకా అసమ్మతి రాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కాకరేపిన ఈయన ఇప్పుడు రేవంత్ రాకతో చల్లబడ్డారు. భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయిందని.. సరైన నాయకత్వం లేకపోవడమే కారణమన్నారు. సోనియా రాహుల్ గాంధీలు ఏ తప్పు చేయలేదని.. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా చేశారన్నారు. కొంత మంది స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కానీ.. పోరాటం చేసే విషయంలో కానీ సరైన పద్ధతిలో పనిచేయకపోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్ బలహీనపడేలా చేశారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో.. ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంతోనే ఓడిపోయామన్నారు. అందుకే తాను కాంగ్రెస్ కు దూరం జరిగానని.. విభేదించానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్నానన్నారు. రెండు సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్న విషయం వాస్తమే కానీ.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.