Idream media
Idream media
హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి కన్ఫార్మ్ అయినట్లేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌రెడ్డి భారీ ర్యాలీ, హంగామా నడుమ తెలంగాణ భవన్ కు చేరుకుని సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అభ్యర్థిపై ఆ పార్టీ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే, తానే టీఆర్ఎస్ అభ్యర్థినంటూ గతంలో కౌశిక్ రెడ్డి మాటలు వైరల్ కావడం వివాదాస్పదంగా మారింది. ఈ రచ్చ నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చు అనే అనుమానాలు కలిగాయి. దానికి తోడు పార్టీలో కౌశిక్ రెడ్డి చేరిక కూడా వాయిదా పడడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. కానీ, కౌశిక్ చేరిక సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలను గమనిస్తే ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
వాస్తవానికి కౌశిక్ రెడ్డి ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అంతలో అదే రోజు టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరడంతో కౌశిక్ చేరిక వాయిదా పడింది. తాజాగా టీఆర్‌ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో బుధవారం ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్ లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పోటీ చేసేది హుజూరాబాద్ లో అయినా, కేవలం తన సత్తా ఏంటో కాంగ్రెస్ వర్గాలకు తెలపడం కోసమే ఇంత హంగామా సృష్టించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమతి లేకుండా ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు జీహెచ్ ఎంసీ సుమారు రూ. 10 లక్షలకు పైగా పెనాల్టీ వేసిందంటే.. కౌశిక్ ఎంతలా హల్ చల్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
టీఆర్ఎస్ వెళ్లే ముందే ఈటల రాజేందర్ కు కౌశిక్ కౌంటర్ ఇచ్చారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని రెండు రోజుల క్రితం రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి రివర్స్ లో చేసిన విమర్శలతో నియోజకవర్గంలో పోటీకి ఇద్దరూ సై అంటే సై అంటున్నారన్న విషయం తెలుస్తోంది. ‘హత్యా రాజకీయాలు చేయడంలో ఈటల రాజేందర్‌ది అందె వేసిన చేయి. 2018 ఎన్నికల సందర్భంగా కమలాపూర్ మండలం మర్రిపల్లి వద్ద నన్ను చంపేందుకు కుట్ర పన్నాడు. మాజీ ఎంపీటీసీ బాలరాజును 2014 ఎన్నికల సందర్భంగా హత్య చేయించారు’ అని కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే.. ‘హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ టికెట్ నాకే వస్తుందని భావిస్తున్నా. ఒకవేళ రాకున్నా ఈటల ఓటమి లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు పనిచేస్తా’ అని చెప్పడంతో టికెట్ పై కౌశిక్ కు అనుమానాలు ఉన్నట్లు నిన్న ప్రచారం జరిగింది.
తాజాగా కౌశిక్‌రెడ్డి.. వందలాది కార్లు, అనుచరులతో తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను పార్టీలోకి స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా మాట్లాడారు.. ‘కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం.. గెలవడం నిరంతర ప్రక్రియ. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు.. ఇది రాచరిక వ్యవస్థ కాదు’ అని తెలిపారు. అంతేకాకుండా.. కౌశిక్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్నారు. ఆయన్ను ఎవడూ ఆపలేడని, కౌశిక్ ఉన్నతికి అందరి సమక్షంలో మాట ఇస్తున్నానని కేసీఆర్ చెప్పారు. దీంతో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేది కౌశిక్ రెడ్డే అని ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.