iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ దే కీలక పాత్ర

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ దే కీలక పాత్ర

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీఆర్ఎస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ప్ర‌ధానంగా గ‌త రెండు ప‌ర్యాయాలు ఓడిపోయిన హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హబూబ్ న‌గ‌ర్ స్థానంలో గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. అందుకోస‌మే స‌రైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేసింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో ఎప్పుడూ ముందుండే గులాబీ బాస్ ఈ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిని మాత్రం నామినేష‌న్ గ‌డువు మ‌రో రెండు రోజులు ముగుస్తుంద‌న్నంత వ‌ర‌కూ చెప్ప‌లేదు. దీంతో ఇక్క‌డ అసలు టీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. అంద‌రి అనుమానాల‌ను ప‌టాపంచలు చేస్తూ పీవీ కుమార్తె సుర‌భి వాణీదేవిని అభ్య‌ర్థిగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈసారి ఎలాగైనా ఇక్క‌డ విజ‌యం సాధించాల‌నే ఉద్దేశంతో ఈమెను రంగంలోకి దింపార‌ని అంద‌రూ భావిస్తున్నారు.

దీటైన అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు.. ప్ర‌చారం కూడా ప‌క్కా చేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. మంత్రులు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌ను టీమ్ గా ఏర్ప‌రిచి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అంద‌రూ ఓ ఎత్త‌యితే, మంత్రి హ‌రీశ్ రావు రంగంలోకి దిగ‌డం ఓ ఎత్తుగా మారింది. ఎన్నిక‌ల్లో ట్ర‌బుల్ షూటర్ గా హ‌రీశ్‌రావుకు పేరుంది. దుబ్బాక మిన‌హా ఆయ‌న బాధ్య‌త‌లు వ‌హించిన చాలా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను హ‌రీశ్ గెలిపించారు. నిన్న, మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా మీదే ఫోకస్ పెట్టిన హరీశ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ ఆయ‌న‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో ఆ టాస్క్‌లో బిజీ అయి పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలగాన్ని మొత్తం రంగంలోకి దింపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించారు. వారు ప్రతి ఓటర్లను కలిసే విధంగా ప్లాన్ చేశారు. వారిని పర్యవేక్షించే బాధ్యతను జిల్లాల వారీగా మంత్రులకు అప్పగించారు.

హ‌రీష్ రావు కు పార్టీలోనే కీల‌క నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 32 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్ప‌టి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా తెలంగాణ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగారు. 2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా పని చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగెట్టారు.

తెలంగాణ కోసం రాజీనామా చేసి సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచారు. 2010లో నాటి యూపీఏ ప్ర‌భుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల కాలం వరకు మెదక్ జిల్లాకే పరిమితమైన హరీశ్ రావుకు సైతం అనూహ్యంగా కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను అప్పగించారు. దీంతో ఆయ‌న రోజూ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తిరుగుతూ వాణీదేవి గెలుపు కోసం విస్తృతంగా కృషి చేస్తున్నారు. హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల నియోజ‌వ‌ర్గాల్లో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగిస్తున్నారు.

Read Also : ఆ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తానంటే కానీ ఆయన పార్టీలో ఉన్న సంగతి గుర్తు రాలేదే..!