Krishna Kowshik
Krishna Kowshik
ఆకాశంలో సగం, అవని సగం అంటూ మహిళలను పొగుడుతుంటారు కానీ.. వాస్తవంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎంతటి ఉన్నత స్థానాలకు ఎదిగిన ఆడవాళ్లకు వేధింపులు తగ్గడం లేదు. భవిష్యత్ తరాన్ని తయారు చేసే విద్యా రంగంలో కూడా కొన్ని చీడ పురుగుల కారణంగా మహిళలు ఇబ్బందులకు గురౌతున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు.. ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటుచేసుకుంది. తన చావుకు ప్రిన్సిపల్, తోటి ఉపాధ్యాయురాళ్లే కారణమంటూ పేర్కొనడం గమనార్హం. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..
చెన్నూరు బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తిరుమలేశ్వరి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె స్వగ్రామం మంచిర్యాల జిల్లా నస్పూర్. ఆమెకు భర్త సంపత్, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కరీం నగర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యూటేషన్ పై చెన్నూర్ వచ్చారు. కాగా, ఈ నెల ఒకటో తేదీ నుండి ప్రిన్సిపల్ ఆమెకు మెస్ కేర్ టేకర్ గా అదపు బాధ్యలిచ్చారు. వాటితో పని ఒత్తిడి ఎక్కువయ్యింది. మెస్ కు సంబంధించిన అంశాల్లో ప్రిన్సిపల్ రాజమణి, మరికొంత మంది ఉపాధ్యాయులు వేధిస్తున్నారంటూ భర్త దగ్గర మొరపెట్టుకుంది. సోమవారం విధి నిర్వహణలో భాగంగా ఉదయం ఎ నిమిది గంటలకు భర్త సంపత్ తిరుమలేశ్వరిని గురుకులం వద్ద దింపి వెళ్లాడు.
గంట తర్వాత ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పలు మార్లు ఫోన్ చేశాక.. ఒక వ్యక్తి లిఫ్ట్ చేసి పెద్ద చెరువు కట్టపై బ్యాగు ఉందని, ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేశానని చెప్పాడు. వెంటనే సంపత్ చెరువు కట్ట వద్దకు వెళ్లగా .. భార్య నీళ్లల్లో దూకినట్లు గుర్తించారు. జాలర్ల సహాయంతో చెరువులో గాలించగా.. భార్య మృతదేహం లభ్యమైంది. పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ప్రిన్సిపల్ రాజమణితో సహా పలువురు ఉపాధ్యాయులు తనను వేధించారంటూ వాయిస్ రికార్డులో పేర్కొంది. తిరుమలేశ్వరి ప్రిన్సిపల్, ఆమె సహ ఉద్యోగులపై భర్త సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.