iDreamPost
iDreamPost
తెలుగు సినిమా ప్రస్థానంలో ఒక దర్శకుడి రెండు దశాబ్దాల ప్రస్థానంలో అసలు పరాజయం ఎరుగక పోవడమంటే అరుదైన ఘనత. అంత గొప్ప చరిత్రలో నిలిచిపోయిన మాయాబజార్ తీసిన కెవి రెడ్డి లాంటి వాళ్ళు సైతం ఫ్లాపులు డిజాస్టర్లు చూశారు కానీ జక్కన్నకు మాత్రం ఆ మరక అంటలేదు. పైపెచ్చు ఆర్ఆర్ఆర్ దెబ్బకు అంతర్జాతీయ స్థాయిలో రస్సో బ్రదర్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ తోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రపంచపు అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్లో తెలుగు భాషే రాని వేలాది విదేశీయులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. మహేష్ బాబుతో చేయబోయే మూవీని జస్ట్ గ్లోబల్ టాట్టరింగ్ అంటేనే అదో ట్రెండింగ్ పదం అయిపోయింది.
ఇదంతా రాజమౌళికి సులభంగా దక్కలేదు. తండ్రి విజయేంద్రప్రసాద్ వద్ద రచనలో మెళుకువలు నేర్చుకోవడంతో మొదలై శాంతినివాసం టీవీ సీరియల్ డైరెక్ట్ చేసే దాకా తీసుకెళ్లింది. మాములుగా వందలాది ఎపిసోడ్లతో సాగిపోయే బుల్లితెర దర్శకుడిగా మారాక వెండితెర అవకాశాలు రావు. కానీ రాజమౌళి కలలు అంతరిక్షాన్ని దాటి ప్రయాణించేవి. అందుకే గురువు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో తన డెబ్యూని ‘స్టూడెంట్ నెంబర్ వన్’ రూపంలో అద్భుతంగా ప్రారంభించాడు. ‘సింహాద్రి’లో జూనియర్ ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ రికార్డులు ఊచకోత కోయించడం చూసి ఇండస్ట్రీ మొత్తం నివ్వెరబోయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘సై’ సైతం వంద రోజులు ఆడింది.
ప్రభాస్ తో మొదటిసారి జట్టుకట్టిన ‘ఛత్రపతి’ ఏకంగా డార్లింగ్ ని మాస్ లో స్టార్ ని చేసింది. రవితేజని డ్యూయల్ రోల్ లో పోలీస్ ఆఫీసర్ గా ఆవిష్కరించిన ‘విక్రమార్కుడు’ ఇప్పటికీ మాస్ మహారాజా ఫ్యాన్స్ కి టాప్ 3లో ఉంటుంది. తారక్ ని మూడోసారి కలిపిన ‘యమదొంగ’లో ఇద్దరి విశ్వరూపాన్ని చూడొచ్చు. ఇక ‘మగధీర’ సంగతి సరేసరి. రాజమౌళి బెస్ట్ వర్క్స్ లో బాహుబలి తర్వాతి స్థానం దీనిదే. కమెడియన్ సునీల్ ని పెట్టి ‘మర్యాదరామన్న’ తీసినా, హీరోనే లేకుండా ‘ఈగ’ను చేసినా రికార్డులు బద్దలు కావడం మాత్రం ఆగలేదు. ఇక ‘బాహుబలి 1’, 2 ల గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. ఇక వర్తమానంలో జరుగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం ఇంకా పచ్చిగానే ఉంది. ఇన్ని క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కాబట్టే 21 ఏళ్ళ కెరీర్ లో తీసింది పన్నెండు సినిమాలే అయినా రాజమౌళినే అగ్రసింహాసనం అంటిపెట్టుకుని ఉంది