iDreamPost
android-app
ios-app

హ్యాపీ బర్త్ డే “జార్ఖండ్ డైనమైట్”

హ్యాపీ బర్త్ డే “జార్ఖండ్ డైనమైట్”

పాఠశాల రోజులలో మొదట ఫుట్‌బాల్‌పై ప్రేమ ఉన్న ఒక చిన్న పట్టణ కుర్రాడు క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ళలో ఒకడిగా పేరొందాడు.ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడిగా నిలిచాడు. అసాధారణమైన బ్యాటింగ్ ప్రతిభతో మాస్టర్ ఛేజర్,గ్రేట్ ఫినిషర్‌గా ఘనత వహించిన ప్లేయర్ అతడు.ఇంత మాట్లాడుకున్నాక అతని పేరు కూడా తెలుసుకోవాలి కదా మనం…ఎస్ అతడే “నెంబర్ 7 ఎంఎస్ ధోని”

ఇవాళ భారత మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని 39 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సాధించిన ఘనతలను ఒక లుక్కేద్దాం.

వన్డే క్రికెట్‌లో మాస్టర్ ఛేజర్:

వన్డే చరిత్రలో విజయవంతమైన మ్యాచ్‌లలో బాబర్ అజామ్ (85.37), విరాట్ కోహ్లీ (77.37) తర్వాత ఎంఎస్ ధోని మూడవ అత్యధిక సగటు (69) సాధించిన క్రికెటర్. ఇక వన్డేలలో విజయవంతమైన లక్ష్యఛేదనలో 102.71 సగటుతో ధోనీ అసాధారణమైన రికార్డుతో బ్యాటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.ఇది రన్ మిషన్ విరాట్ కోహ్లీ యొక్క 96.21 సగటు కన్నా ఎక్కువ. జార్ఖండ్ డైనమెట్ ధోని ఛేజ్‌లో అజేయంగా నిలిచిన 50 మ్యాచ్‌లలో భారత్ కేవలం రెండిటిలోనే ఓడిపోయింది. ఈ గణాంకాల ప్రకారం అతని ఛేజ్-నాటౌట్-విజయ శాతం 94%.అలాగే గొప్ప మిడిల్-ఆర్డర్ ఫినిషర్‌గా పేరొందిన మైఖేల్ బెవన్‌తో పోల్చి చూసిన ఛేదనలో ధోనీదే పైచేయి.అతను అజేయంగా నిలిచిన 30 మ్యాచ్‌లలో 25 (83.33%) మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది.

కఠిన పరిస్థితులలో పరుగులు సాధించే బ్యాట్స్‌మన్‌:

ధోని యొక్క టాప్10 వన్డే ఇన్నింగ్స్‌లలో సగం జట్టు ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు ఒత్తిడిలో పరుగులు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2017 లో కటక్‌లో ఇంగ్లండ్‌పై 3 వికెట్లకు 25 పరుగుల వద్ద బ్యాటింగ్‌కు దిగిన అతను కేవలం 122 బంతులలో 134 పరుగులు చేసి, యువరాజ్ సింగ్‌తో కలిసి 4 వ వికెట్‌కు 256 పరుగులు చేశాడు.అలాగే 2010లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన విజయవంతమైన ఛేజింగ్‌లో 107 బంతులలో అజేయంగా 101 పరుగులు చేశాడు.2005లో అతని రెండు భారీ సెంచరీలు (విశాఖపట్నంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 148), జైపూర్‌లో శ్రీలంకపై 298 పరుగుల విజయవంతమైన ఛేజింగ్‌లో 183, రెండూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి సాధించాడు.అప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఒక సంవత్సరం కూడా దాటని ఎంఎస్ ధోని ఈ రెండు గొప్ప ఇన్నింగ్స్‌లతో తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు.

2007 లో చెన్నైలో ఆఫ్రికా ఎలెవన్‌పై ఆసియా ఎలెవన్ తరఫున అతని అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌లో ఒకటి. ఆసియా ఎలెవన్ 5 వికెట్లకు 72 పరుగులు చేసి కష్టాలలో ఉన్న సందర్భంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోని కేవలం 97 బంతులలో అజేయంగా 139 పరుగులు చేశాడు.మహేలా జయవర్ధనేతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

మిడిల్ ఆర్డర్ అద్భుత బ్యాట్స్‌మన్‌లలో ఒకరు:

అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పైగా పరుగులు చేసిన 14 మంది బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు.వారిలో 50 కంటే ఎక్కువ సగటున 10,000-ప్లస్ పరుగులు సాధించిన ఇద్దరు బ్యాట్స్‌మన్‌లలో (మరొకరు కోహ్లీ) ధోని ఒకరు.

తన కెరీర్‌లో ఎక్కువ భాగం మిడిల్-ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి ఇన్ని పరుగులు సాధించినవాడు ఎంఎస్ ధోని ఒక్కడే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటింగ్ సగటు 50 లేదా అంతకంటే ఎక్కువ (కనిష్ట 2000 పరుగులు) కలిగిన 8 మంది బ్యాట్స్‌మన్‌ ఉన్నారు. ఈ జాబితాలో స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన మైఖేల్ బెవన్‌తో పాటు ధోని ఒక్కరికే చోటు దక్కింది.తన కెరీర్‌లో ఎక్కువ భాగం 5 లేదా 6 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని ఇంత ఎక్కువ సగటుతో 10,000-ప్లస్ పరుగులు సాధించడం ఖచ్చితంగా అతని బ్యాటింగ్ ప్రతిభకు నిదర్శనం.

గోల్డెన్ పీరియడ్ కెప్టెన్సీ:

2008-2014 మధ్య ఏడు సంవత్సరాలలో (2010 మినహా) ప్రతి సంవత్సరం ఎంఎస్ ధోని పరుగుల సగటు 50 కంటే ఎక్కువ. ఈ కాలంలో అతను 133 ఇన్నింగ్స్‌లలో 5,354 పరుగులు చేశాడు.ఇందులో అతని 10 కెరీర్ సెంచరీలలో 6 ఉన్నాయి.ఈ కాలంలో ధోని సగటు 59.48 రెండవ అత్యధికం.ఇది డివిలియర్స్ (60.38) కంటే స్వల్పంగా తక్కువ కావడం గమనార్హం.

2008-2014 మధ్య వన్డే క్రికెట్‌లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ ఉత్తమ 1.88 విజయ-నష్ట నిష్పత్తిని నమోదు చేసింది. పైగా టీమిండియా రెండు ప్రధాన ఐసీసీ ప్రపంచకప్‌లను గెలుచుకుంది.అతని బ్యాటింగ్ విజయాలు,స్టంప్స్ వెనుక ఆశ్చర్యంగొలిపే నిర్ణయాలతో 2011 వన్డే ప్రపంచ కప్,2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశానికి విజయాన్ని అందించిన కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు.

ధోనీ రివ్యూ సిస్టం:

ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్‌గా కూడా ఘనత వహించిన ఎంఎస్ ధోని తన మార్క్ చూపించాడు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో స్పందిస్తూ బౌలర్లకు చిట్కాలు చెబుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించేవాడు.ఫలితంగా అభిమానులు DRS అంటే “ధోనీ రివ్యూ సిస్టం” అని పిలిచే స్థాయికి ఫేమస్ అయ్యాడు. బౌలర్ల బౌలింగ్‌ను బట్టి ఫీల్డింగ్ కూర్పును సెట్ చెయ్యటంలో ధోనిని మించిన క్రికెటర్ మరొకరు లేరు అనడం అతిశయోక్తి కాదు.ఎంత ఒత్తిడిలోనైన కంట్రోల్ తప్పకుండా కూల్‌గా నిర్ణయాలు తీసుకోవడం కారణంగా ‘ కెప్టెన్ కూల్’ అని అందరూ పిలిచేలా చేసుకున్నాడు.

ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. 350 వన్డే ఇంటర్నేషనల్స్ బరిలోకి దిగి ఏకంగా 50.57 యావరేజ్ తో 10773 రన్స్ సాధించాడు.ఇక 98 టీ-20లు ఆడి 1617 రన్స్ చేశాడు.

క్రికెట్‌లో ఉన్నప్పుడు బిజీగా గడిపిన ఎంఎస్ ధోని లాక్‌డౌన్ సమయంలో ఫామ్‌హౌస్‌లో ఉంటూ సేంద్రియ వ్యవసాయం చెయ్యడం అభిమానులను ఆకర్షించింది.కరోనా నేపథ్యంలో నేటి తన పుట్టిన రోజును ఎంఎస్ ధోని నిరాడంబరంగా జరుపుకుంటున్నాడు.

iDreamPost టీమ్ నుంచి 40వ పడిలోకి ప్రవేశిస్తున్న ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు….