iDreamPost
iDreamPost
వలస పాలకులు వెళ్తూ వెళ్తూ.. మన గుండెలను బద్దలుగొట్టారు. ప్రాంతాలను ముక్కలు చేశారు. దేశాలుగా విడగొట్టారు. అన్నదమ్ముల్లాంటి దాయాదుల మధ్య చిచ్చు రగిల్చారు. కానీ దేశానికి జీవనాడుల్లాంటి రైల్వే లైన్లను మాత్రం విడిచిపెట్టారు. కానీ దాయాదితో జరిగిన యుద్ధం రెండు దేశాల మధ్య మిగిలిన రైలు బంధాన్ని కూడా తెంచేసింది. దాంతో ఒక ప్రధాన రైలుమార్గం అర్థ శతాబ్దానికిపైగా అచేతనంగా మారి చితికిపోయిన అఖండ భారత వైభవానికి చేదు జ్ఞాపకంగా వెక్కిరిస్తూ కనిపించేది. అచేతనమైన ఆ జీవనాడి ఇన్నాళ్లకు మళ్లీ పునరుజ్జీవం పొందింది. రైళ్ల రాకపోకలకు రాజమార్గం వేస్తూ సందడి చేయడం మొదలుపెట్టింది. అదే భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ రైలు రవాణాకు ప్రాణం పోసిన హల్దీబరి-చిలహతి రైలుమార్గం.
1965లో మూతపడిన మార్గం
భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా రెండు దేశాలను కలువుతున్న రైలు మార్గాల్లో మన దేశం నుంచి పలు రైళ్లు తూర్పు పాకిస్థాన్ భూభాగంలోకి రాకపోకలు సాగించేవి. అటువంటి మార్గాల్లో హల్దీబరి-చిలహతి బ్రాడ్ గేజ్ మార్గం ప్రధానమైనది. దేశ విభజన తర్వాత కూడా తూర్పు పాకిస్థాన్ భూభాగం మీదుగా రైళ్లు అసోం, ఉత్తర బెంగాల్ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవి. అయితే 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న కొద్దిపాటి రవాణా సౌకర్యాలను కూడా తెంచేశాయి. ఆ యుద్ధం అనంతరం పాకిస్తాన్ తో సంబంధాలు బాగా క్షీణించడంతో మన దేశం తూర్పు పాకిస్తాన్ తో ఉన్న అన్ని రకాల రైలు సర్వీసులను రద్దు చేసింది. దాంతో హల్దీబరి-చిలహతి రైలుమార్గం నిర్జీవంగా మారింది. 1971లో పాకిస్థాన్ నుంచి విముక్తి కోసం భారత్ సాయంతో పోరాడి విజయం సాధించిన తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పేరుతో కొత్త దేశంగా ఆవిర్భవించింది.
గత డిసెంబరులో ద్వైపాక్షిక ఒప్పందం
నాడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్నప్పుడు పనిచేసిన హల్దీబరి-చిలహతి రైలు మార్గాన్ని పునరుద్ధరించి ఇరుదేశాల మధ్య రైలు ప్రయాణాలకు శ్రీకారం చుట్టాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా గత డిసెంబర్17న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లా ప్రధాని హసీనా వర్చువల్ విధానంలో ఈ మార్గాన్ని ప్రారంభించారు. అయితే కరోనా ఇతరత్రా కారణాల వల్ల రైలు సర్వీసుల ప్రారంభం ఆలస్యమైంది. ఎట్టకేలకు అది కూడా సాకారమైంది. జులై 31వ తేదీ రాత్రి బెంగాల్లోని అలీపుర్దార్ డివిజన్ పరిధిలోని డామ్ డిమ్ స్టేషన్ నుంచి మొదటిగా గూడ్స్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ఆగస్ట్ ఒకటో తేదీన బంగ్లాదేశ్ చేరుకుంది. అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్ల నుంచి బంగ్లాదేశ్ కు సరుకు రవాణాకు ఈ మార్గం బాగా ఉపయోగపడుతుందని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. అంతే కాకుండా భూమార్గంలో ప్రాంతీయ వాణిజ్యం అభివృద్ధికి, ఈశాన్య భారత ప్రగతికి, దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు ఈ రైలుమార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.