iDreamPost
android-app
ios-app

గువ్వల చెరువు పాలకోవా… !

గువ్వల చెరువు పాలకోవా… !

పాలకోవాని చూడగానే నోరూరానివారెవరుంటారు..! అయితే పాలకోవా అసలు సిసలు రుచి తెలియాలంటే గువ్వలచెరువుకి వెళ్లాల్సిందే… అక్కడ దొరికే ఖవ్వా పాలకోవా పనిపట్టాల్సిందే…! రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలు ఎక్కువగా పాడిపై ఆధారపడుతుంటారు. ఇదే కోవా తయారీకి నేపథ్యంగా మారి రాయలసీమ రుచుల్లో ఆ వంటకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఇంతకీ గువ్వల చెరువు ఎక్కడుందదనేగా మీ సందేహం..! భిన్న రుచులను ఆస్వాదించాలనుకొనే వారికోసమే కింది వివరాలు…

వైఎస్సాఆర్ కడప జిల్లా రామాపురం మండలంలోని ఓ చిన్న గ్రామం గువ్వలచెరువు. జాతీయ రహదారి 40 పై కడప నుంచి రాయచోటి వైపు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొండల మధ్య ఘాట్ రోడ్డు వస్తుంది. ఆ కొండ దిగగానే ఒక వైపు చింతకొమ్మదిన్నె తండాలు ఉంటె మరోవైపు గువ్వలచెరువు ఉంటుంది. 2000 జనాభా ఉండే ఆ గ్రామాన్ని చేరుకోగానే రోడ్డుకి ఇరువైపులా స్వచ్ఛమైన పాలకోవా అమ్మే దుకాణాలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తాయి. ఆ దారి గుండా పోయేవారంతా అక్కడ ఆగి అరిటాకుల్లో వడ్డించే పాలకోవాను రుచి చూసి వెళ్తుంటారు.

గువ్వల చెరువు కేవలం పాలకోవాకే కాదు.. పకృతి అందాలకూ నెలవుగా ఉంది. గ్రామానికి దగ్గర్లో రెండు కొండల చరియల మధ్యలో ఉండే గనికోన వీక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. అలాగే 3 కిలోమీటర్లు దూరంలోని బాపున్ కోన, ముట్టుకోన జలపాతాలు వర్షాకాలంలో ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తాయి.

దాదాపు 80 ఏళ్ళక్రితం గువ్వల చెరువులో ఇద్దరు ముగ్గురు కోవా తయారీని ప్రారంభించారు. వారంతా సమీపంలోని గ్రామాల నుంచి పాలు సేకరించి కోవా తయారు చేసి అమ్మేవారు. తదనంతరం అనేక మంది వారి బాటలో నడవటంతో ఈ గ్రామం కోవాకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే కర్ణాటక వాసులు ఇక్కడ ఎక్కువగా కోవా కొనుగోళ్లు జరుపుతుంటారు. చిక్ బళ్లాపుర, దేవరహళ్లి, బెంగళూరు, కడప, కర్నూల్, విజయవాడ, తిరుపతిలతోపాటు గల్ఫ్ దేశాలకు సైతం గువ్వలచెరువు పాలకోవా ఎగుమతి అవుతోంది.

అలాగే రాజకీయనాయకు నిర్వహించే కార్యక్రమాలు, వివాహాది కార్యక్రమాలతో కోవాను వడ్డిస్తున్నారు. సినీ ప్రముఖులకు బహుమతులుగా ఇచ్చేందుకు ఇక్కడి నుంచి కోవా ఖవ్వాను తీసుకెళ్తున్నారు. గువ్వల చెరువు కోవాతోపాటు కోవా బన్ను కూడా రాయలసీమలో ఎంతో ప్రత్యేకం. రెండు బన్నుల మధ్య కోవా ఉంచి తయారుచేసే కోవా బన్ను లను కడప, బద్వేలు, అనంతపురం, మైదుకూరు ప్రాంతాల్లో ఎక్కువగా తింటుంటారు. మీరూ ఎప్పుడైనా ఆ మార్గం గుండా వెళ్తే కోవాను ఆస్వాదించండి… ఓ తీపి జ్ఞాపకంగా మిగులుతుంది.