iDreamPost
android-app
ios-app

గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా గురజాల ఎమ్మెల్యే..

  • Published Jun 25, 2020 | 1:14 PM Updated Updated Jun 25, 2020 | 1:14 PM
గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా గురజాల ఎమ్మెల్యే..

స్థానికంగా సుపరిపాలన అందించినప్పుడే గ్రామ స్వరాజ్య కల సాకారమవుతుంది . వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన విలేజ్ వలంటీర్ ల ద్వారా సంక్షేమ ఫలాల్ని నేరుగా గ్రామంలో అందిస్తుండగా , గ్రామ సచివాలయ వ్యవస్థ స్థానిక పాలన మరింత మెరుగు కావడానికి తోడ్పడింది . ఇటీవల ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి అత్యంత మేలు చేసే అంశంగా చెప్పవచ్చు . ఇహ దశలవారీ మద్యపాన నిషేధం ద్వారా దీనికి బానిసలవుతున్న బడుగు , బలహీన వర్గాల కుటుంబాలకు మద్యం మహమ్మారి నుండి చాలా వరకూ విముక్తి కలుగుతున్న విషయం గణాంకాల ద్వారా తేటతెల్లం అవుతుంది .

అయితే కొన్ని మారుమూల పల్లెల్లో నాటు సారా , అక్రమ మద్యం వినియోగం కేసులు నమోదు అవుతుండగా వీటిని అరికట్టడానికి వైసీపీ ప్రభుత్వం విలేజ్ వలంటీర్ , గ్రామ సెక్రటేరియట్ పోలీస్ ల ద్వారా సమాచారం సేకరిస్తూ అదుపు చేస్తున్న తీరు ప్రశంసనీయం . ఈ విషయంలో మరో స్ఫూర్తిదాయక ముందడుగు వేశారు వైసీపీ యువనేత , గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి .

దాచేపల్లి మండల పోలీస్ స్టేషన్ లో గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమైన మహేష్ మాట్లాడుతూ నిషేధిత గుట్కా , అక్రమ మద్యం ఎవరు అమ్ముతున్నా వెంటనే పోలీసులకు సమాచారమందించమని కోరారు . సచివాలయ మహిళా పోలీసుల కృషితోనే ఒక్క నెలలోనే గుట్కా , అక్రమ మద్యం వినియోగానికి సంభందించి 140 కేసులు నమోదు చేసి నేరస్తుల్లో భయాన్ని రేకెత్తించామని ఇదే స్ఫూర్తితో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు పని చేయాలని ఈ క్రమంలో నేరస్తుడు ఎంత పెద్ద వాడైనా ఏ పార్టీకి చెందిన వారైనా ధైర్యంగా కంప్లైంట్ చేయాలని , ఈ క్రమంలో మీకేమయినా ఇబ్బందులు ఎదురైనా , ఎవరైనా బెదిరించినా నన్ను నేరుగా సంప్రదించాలని తెలిపారు .

అంతే కాకుండా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యువ ఎమ్మెల్యే . గ్రామ పెద్దలను నేరుగా సంప్రదించి మద్యం సేవించమని , గ్రామంలో అక్రమ మద్యం వినియోగం జరక్కుండా అడ్డుకొంటామని గ్రామస్తులందరి చేత తీర్మానం చేయించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాసు మహేష్ రెడ్డి . మద్యపాన సమస్య మూలాలను ఛేదించే దిశగా సాగుతున్న ఈ కార్యక్రమానికి పలు గ్రామాలనుండి మంచి స్పందన రావడం ముదావహం .

గత ప్రభుత్వ హయాంలో పేకాట క్లబ్బులకు , అక్రమ మైనింగ్ కు పెట్టింది పేరైన వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్ , సంసారాలను గుల్ల చేస్తున్న పేకాట క్లబ్బులను అరికట్టిన మహేష్ , నియోజక వర్గంలోని గురజాల , దాచేపల్లిలకు మునిసిపాలిటీ హోదాలను సాధించడమే కాక ఒక మెడికల్ కాలేజీని కూడా సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు .

రాజకీయాల్లోకి వారసులు రావటం సర్వసాధారణం , వచ్చిన వారసులు ప్రజాసేవలో తమ పెద్దలు తెచ్చుకున్న గుర్తింపు , గొప్ప పేరు నిలుపుకోవడం కష్టం . ఏడున్నర ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నాగార్జున సాగర్ వంటి బృహత్తర ప్రాజెక్టులతో రాష్ట్ర రైతులకు ఎంతో మేలు చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి , కేంద్ర మంత్రిగా కమ్యూనికేషన్ , పరిశ్రమల శాఖల ద్వారా ఎన్నో కేంద్ర రంగ సంస్థలను , పలు పరిశ్రమలను రాష్ట్రానికి సాధించి పెట్టి దార్శనికుడయ్యారు . అలాంటి స్ఫూర్తి ప్రదాత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మహేష్ నేడు గురజాల నియోజక వర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తూ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారని చెప్పొచ్చు .