Idream media
Idream media
ఎమ్మెల్యేగా గెలిచినా కొంత మందికి మనశ్సాంతి ఉండదు. పదవి శాశ్వతం కాకపోయినా.. ఉండే ఐదేళ్లలో కూడా రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్ రావు (గిరి) ఎదుర్కొంటున్నారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే అభియోగాలను మోపుతూ, మద్ధాళి గిరిని అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ ఆయన ప్రత్యర్థి ఏసు రత్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏసు రత్నం దాఖలు చేసిన పిటిషన్ మరోసారి ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన మద్ధాళి గిరి 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తొలిసారి మద్ధాళి గిరికి నిరాశే ఎదురైంది. వైసీపీ అభ్యర్థి షేక్ ముస్తపా చేతిలో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో గంటూరు పశ్చిమ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సారి విజయం తలుపుతట్టింది. వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నంపై మద్ధాళి గిరి 4,289 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకే మద్ధాళి గిరి టీడీపీకి దూరంగా ఉండడం మొదలు పెట్టారు. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. దీంతో ఆయన టీడీపీని వీడడం ఖాయమనే ప్రచారం సాగింది. ముఖ్యమంత్రిని కలవడంతో టీడీపీ అధిష్టానం కన్నెర్ర చేసింది. మద్ధాళి గిరి నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నియోజకవర్గ ఇంఛార్జి పదవిని వేరొకరికి కట్టబెట్టింది. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా.. ఆ పార్టీకి మద్ధాళి గిరి అనుకూలంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ టీడీపీ, వైసీపీ వైపుల కాకుండా ప్రత్యేకంగా కూర్చుంటున్నారు.
అనధికారికంగా మద్ధాళి గిరి వైసీపీలో ఉన్నట్లే. చంద్రగిరి ఏసు రత్నం కూడా వైసీపీలోనే ఉన్నారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే అభియోగాలతో ఏసు రత్నం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఎలా వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండడంతో ఒక వేళ కోర్టులో మద్ధాళి గిరికి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయనే చర్చ సాగుతోంది.
Also Read : నారా లోకేష్ లక్ష్యం అదేనా, అఖిలపక్షం ప్రయత్నం ఫలించిందా?