Idream media
Idream media
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ సామెత గుంటూరు టీడీపీకి అచ్చంగా వర్తిస్తుంది. టీడీపీ కీలక నేతలు లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్, మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన సీనియర్ నేత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టారు వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ.. అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసి టీడీపీ పరువు గంగపాలు చేశారు. నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడి వెళ్లిపోతుంటే, ఉన్న నేతలేమో అంతర్గత పోరుతో పార్టీని మరింత బజారుకీడుస్తున్నారు. తాజాగా తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయంలోనే చొక్కాలు చింపుకుని, కుర్చీలు వేసిరేసుకుని నానా రభస చేశారు.
అసలే అధికారం లేదు. ఇలాంటి సమయంలో అధిపత్య పోరుతో పార్టీ పరువును బజారున పడేశారు తెలుగు తమ్ముళ్లు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న తెలుగుదేశంలో తాజాగా చోటు చేసుకున్న తన్నులాట నేతల్ని విస్మయానికి గురి చేసింది. పార్టీపై అధినేత పట్టు క్రమక్రమంగా సడులుతున్నదనటానికి నిదర్శనమే తాజా పోరుగా అభివర్ణించేవారు లేకపోలేదు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండు వర్గాలకు చెందిన తమ్ముళ్లు బాహాబాహీకి దిగటమే కాదు.. కుర్చీల్ని ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. కర్రలతో ఒకరిపై ఒకరు ఇష్టారాజ్యంగా కొట్టేసుకున్నారు. ఈ పోరులో నేతలు.. కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇదంతా కూడా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టి చెరుకూరు మండలంలోని పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా చోటు చేసుకోవటం గమనార్హం.
ఈ ఎన్నికలకు పరిశీలకులుగా దామచర్ల శ్రీనివాసరావు.. పోరంకి రంగారావు.. ఓంకార్ లు సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త కమ్ మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య.. వట్టిచెరుకూరు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్ వర్గీయుల మధ్య నివురుగప్పిన నిప్పులా విబేధాలున్నాయి. సమావేశంలో ముట్లూరుతో పాటు మూడు గ్రామాలకు సంబంధించిన సంస్థాగత ఎన్నికలు సక్రమంగా జరగలేదని.. ఏకపక్షంగా ఎంపికలు చేశారని.. వాటిని తేల్చిన తర్వాతే పార్టీ మండల అధ్యక్ష.. ప్రధాన కార్యదర్శకులను ఎంపిక చేయాలని రమేష్ వర్గీయులు పట్టుబట్టారు.దీనికి పెదరత్తయ్య వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలంలో పదిహేడు గ్రామాలు ఉంటే.. ఎక్కువ గ్రామాల్లో పార్టీ అధ్యక్ష.. ప్రధానకార్యదర్శులు ఎంపిక జరిగిందని.. మూడు గ్రామాల్లో తప్ప మిగిలిన గ్రామాల్లో అభిప్రాయ సేకరణ జరపాలని పట్టుబట్టారు. ఈ వాదన కాస్తా కాసేపటికే వాగ్వాదంగా మారింది.
పార్టీ పరిశీలకుల వద్దకు వెళ్లి గట్టి గట్టిగా మాట్లాడటం.. దీనికి ప్రతిగా మరో వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. పరిస్థితి చేయి దాటిపోతుందన్న విషయాన్ని గుర్తించిన పరిశీలకులు అభిప్రాయ సేకరణను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.అయితే.. అప్పటికే మాటా మాటా పెరగటం.. ఇరు వర్గాల్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాసేపటికే కుర్చీలు విసురుకుంటూ.. కర్రల్ని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా కొట్టుకోవటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రమేశ్ గ్రూపునకు చెందిన పలువురికి గాయాలు కాగా.. మరో వర్గానికి చెందిన కొందరికి తలలు పగలగా.. ఇంకొందరికి తల మీదా.. కంటి మీదా గాయాలు అయ్యాయి.
పార్టీ ఆఫీసులో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న గుంటూరు అరండల్ పేట పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.దీంతో ఇరు వర్గాల వారు అక్కడి నుంచి జారుకున్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.పార్టీలో ఈ తరహా దాడులను తాము సంహించలేమని గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని పార్టీ అధినాయకత్వం వద్దకు తీసుకెళతామన్నారు. పవర్ లేని వేళలో.. పార్టీ పలుచన అయ్యేలా ఇలాంటి గొడవలు మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. ఏం లాభం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది.