iDreamPost
android-app
ios-app

దళిత మహిళ వండితే మేం తినాలా? గుజరాత్ లో మధ్యాహ్న భోజనం మానేసిన విద్యార్థులు

దళిత మహిళ వండితే మేం తినాలా? గుజరాత్ లో మధ్యాహ్న భోజనం మానేసిన విద్యార్థులు

గుజరాత్ లోని ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రెండు నెల్లుగా మధ్యాహ్న భోజనం మానేశారు. అదేమంటే దళిత మహిళ వండుతున్న వంట తినమని సమాధానమిచ్చారు. ఈ విషయలో పిల్లలను, వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి స్కూలు యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మోర్బీ జిల్లా సోఖ్డా గ్రామంలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు పిల్లలు జూన్ 16 నుంచి మధ్యాహ్న భోజనం తినడం లేదు. స్కూల్లో మొత్తం 153 మంది పిల్లలుండగా ఏకంగా 147 మంది మధ్యాహ్నం పూట అన్నం తినేది లేదని చెప్పేశారు. అసలు విషయమేంటని ఆరా తీయగా ధరా మఖ్వానా అనే దళిత మహిళ వంట చేయడమే దీనికి కారణమని తెలిసింది. మధ్యాహ్న భోజనం మానేసిన 147 మంది పిల్లలు కోలి, భర్వాడ్, ఠాకూర్, గఢ్వీ అనే OBC కులాలకు చెందిన వాళ్ళు. ఒక దళిత మహిళ వండిన వంటలు తమ పిల్లల్ని తిననివ్వమని తల్లిదండ్రులు తనతో అన్నట్లు ధరా భర్త గోపీ మఖ్వానా చెబుతున్నాడు. తల్లిదండ్రులకు నచ్చజెప్పడానికి స్కూల్ ప్రిన్సిపాల్ బిందియా రత్నోతార్ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అన్ని కులాలకు చెందిన వారూ సమానమేనని, అంటరానివారంటూ ఎవరూ ఉండరని పిల్లలకు చెప్పగలుగుతున్నాం కానీ పెద్దలకు చెప్పలేకపోతున్నామని బిందియా విచారం వ్యక్తం చేశారు. చివరికి గోపీ మఖ్వానా తల్లిదండ్రుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉత్తరాఖండ్ లోనూ ఇదే తంతు!

కిందటేడాది డిసెంబర్ లో ఉత్తరాఖండ్ లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. చంపావత్ జిల్లాలోని ఓ స్కూలులో సునీతా దేవి అనే దళిత మహిళ వంట చేస్తోందన్న కారణంతో పిల్లలు మధ్యాహ్న భోజనం మానేశారు. తల్లిదండ్రుల ఒత్తిడితో స్కూలు యాజమాన్యం ఆమెను తొలగించి మరొకరిని వంట చేయడానికి పెట్టింది. అయితే కొందరు దళిత విద్యార్థులు ఆమె చేసిన వంట తినకుండా నిరసన వ్యక్తం చేశారు. చివరికి ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ జోక్యం చేసుకుని సునీతా దేవిని తిరిగి నియమించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఈ ఏడాది మేలో కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేది లేదని మొరాయించారు. పిల్లలను స్కూలు నుంచి పంపించేస్తామని చంపావత్ జిల్లా మెజిస్ట్రేట్ హెచ్చరించాక గానీ పరిస్థితి సద్దు మణగలేదు.