Venkateswarlu
Venkateswarlu
పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దలు ఏ ఉద్దేశ్యంతో చెప్పారో తెలియదు కానీ, కొన్ని సార్లు.. కొన్ని విషయాల్లో ఇది మంచికే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్తే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అత్త ప్రవర్తన కారణంగా అల్లుడు పెళ్లిని మధ్యలోనే ఆపేశాడు. పెళ్లి ఆపేంతలా ఆమె ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా?.. పెళ్లిలో సిగరెట్ తాగుతూ అందరి ముందూ డ్యాన్స్ వేసింది. అంతే.. పెళ్లి కాన్సిల్ అయింది. పెద్దల పంచాయతీ తర్వాత పెళ్లి మళ్లీ జరిగింది.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, శంబల్ జిల్లాకు చెందిన యువకుడికి.. రాజ్‌పురాకు చెందిన యువతికి కొన్ని నెలల క్రితం పెళ్లి కుదిరింది. గత నెల 27న పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి ఓ గంట ఉండగా.. పెళ్లి కుమారుడు మండపంలో పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మండపంలోని వారు డ్యాన్సులు చేయటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు తల్లి డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేసింది.
డ్యాన్స్‌లో భాగంగా ఏకంగా సిగరెట్‌ను తాగుతూ రెచ్చిపోయింది. అత్త అలా చేసే సరికి అల్లుడికి కోపం వచ్చింది. వెంటనే పెళ్లిని ఆపేశాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. పంచాయతీ పెద్దలు ఎంతో బతిమాలి రెండు కుటుంబాలను ఒక్కటి చేశారు. తర్వాత పెళ్లి ఘనంగా జరిగింది. మరి, పెళ్లి కూతురు తల్లి సిగరెట్ తాగుతూ పెళ్లిలో డ్యాన్స్ వేయటం వల్ల పెళ్లి ఆపేసిన ఈ వరుడి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.