iDreamPost
android-app
ios-app

విశాఖలో జగన్‌కు ఘన స్వాగతం

విశాఖలో జగన్‌కు ఘన స్వాగతం

మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించిన అనంతరం సీఎం జగన్‌ మొదటి సారిగా ఈ రోజు విశాఖ పర్యటకు వెళ్లారు. విశాఖ నగరంలో దాదాపు 1290 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అనంతరం ఆర్‌కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఆయన సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు.

ఎయిర్‌ పోర్టు నుంచి కైలాసగిరికి బయలుదేరారు. ఎయిర్‌పోర్టు నుంచి దారిపోడువునా సీఎంకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి ఘన స్వాగతం పలికారు. సీఎం చిత్రాలతో కూడిన ప్లకార్డులు, వైఎస్సార్‌సీపీ జెండాలతో ప్రజలు, విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయడంతో విశాఖ నగరం, ఉత్తరాంధ్ర ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం ఈ రోజు విశాఖలో వెల్లడైంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. ఎయిర్‌ పోర్టు నుంచి ఆర్‌కే బీచ్‌ వరకు దాదాపు లక్ష మంది జగన్‌కు స్వాగతం చెప్పేందుకు రోడ్డుకు ఇరువైపుల నిలబడి ఉన్నారు. వారికి సీఎం జగన్‌ అభివాదం చేస్తూ వెళుతున్నారు. మధ్య మధ్యలో ప్రజలను, విద్యార్థుల అడిగిన మేరకు వారితో కరచాలనం చేస్తున్నారు.