iDreamPost
android-app
ios-app

పోటీలో ఉంటే కాద‌న‌గ‌ల‌రా..?

పోటీలో ఉంటే కాద‌న‌గ‌ల‌రా..?

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై న్యాయ స్థానంలో వాద‌న‌లు జ‌రుగుతుండ‌గానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వాలంటీర్ల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వారిని దూరంగా ఉంచాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ వ‌చ్చిన అనంత‌రం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కూడా అవే వ్యాఖ్య‌లు చేశారు. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని అన్నారు. అన‌డ‌మే కాదు.. త‌న అధికారాల‌ను ఉప‌యోగించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లకు సంబంధించి కీలక ఆదేశాలిచ్చారు. అలాగే వాలంటీర్లెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. ఏపీలో 3లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు., దాదాపు 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంత కాలం ఈ ఆదేశాలు అమలో ఉంటాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా..రాప్తాడు లో ఓ వ‌లంటీర్ ఏకంగా స‌ర్పంచ్ గా బ‌రిలో నిల‌బ‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల విధులకు వ‌ద్ద‌న్నారు గానీ.. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఎవ‌రూ ఆప‌లేరుగా.. అనే వాద‌న మొద‌లైంది. ఉత్తమ సేవలందిస్తున్న ఆ మహిళా వలంటీర్‌ను గ్రామస్తులు సర్పంచ్‌ బరిలో నిలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన సత్యవతి మండలంలోని ప్రసన్నాయపల్లిలో వలంటీర్‌ పోస్టుకు ఎంపికైంది. వలంటీర్‌ ఉద్యోగం రావడంతో సత్యవతి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుండేది. ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరవేసేది. ఆమె సేవలను గుర్తించిన మండల స్థాయి అధికారులు ఉత్తమ మండల వలంటీర్‌ అవార్డును ప్రకటించారు.గ్రామ వలంటీర్‌గా ఉన్నప్పుడే సత్యవతి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందు వరసలో ఉంటుందని గ్రహించిన గ్రామస్తులు ప్రసన్నాయపల్లి పంచాయతీ సర్పంచ్‌గా బరిలో దింపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె పోటీ ఆస‌క్తిగా మారింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్‌ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. తొలిదశలో 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు కాగా,ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉ.6:30 నుంచి మ.3:30 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.