iDreamPost
android-app
ios-app

ప్రొఫెసర్లను పట్టించుకోని పట్టభద్రులు

ప్రొఫెసర్లను పట్టించుకోని పట్టభద్రులు

హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టుభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి కోదండరాం, నాగేశ్వర్‌ పోటి చేసిన విషయం తెలిసిందే. ఇద్దరూ ప్రొఫెసర్లే. నల్లగొండ స్థానం నుంచి కోదండరాం, హైదరాబాద్‌ స్థానం నుంచి నాగేశ్వర్‌ పోటీ చేశారు. వారు తమ వృత్తిలో భాగంగా వేలాది మంది పట్టభద్రులను తీర్చిదిద్దారు కూడా.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఇద్దరూ ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు నల్లగొండలో ప్రొఫెసర్‌ కోదండరాం, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రధాన పోటీదారులుగా ఉంటారన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే నల్లగొండలో అనూహ్యంగా తీన్మార్‌ మల్లన్న ప్రధాన పోటీలోకి దూసుకురాగా.. హైదరాబాద్‌లో సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి మధ్యనే పోటీ నడిచింది. దీంతో అటు నల్లగొండలో కోదండరాం, ఇటు హైదరాబాద్‌లో నాగేశ్వర్‌ ఎలిమినేషన్‌ వరకూ మూడో స్థానంలోనే కొనసాగారు. ముఖ్యంగా ప్రత్యక్ష ఎన్నికలను తొలిసారి ఎదుర్కొన్న కోదండరాంకు చేదు అనుభవమే మిగిలింది.

టీజేఎస్‌ తరఫున నల్గొండ స్థానం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తొలి నుంచీ ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ఆర్థిక వనరుల లేమి ఓవైపు వేధించగా.. పార్టీ జిల్లా కమిటీలు విస్తృత స్థాయిలో పనిచేసే పరిస్థితిలో లేవు. పోలింగ్‌ రోజు ఏజెంట్లు లేక ఎవరైనా దొరుకుతారా? ముందుకొస్తే రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు వెతుకులాడిన పరిస్థితి ఏర్పడింది. చివరికి మొదటి ప్రాధాన్యంలో 70,072 ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 33వేల ఓట్లు సాధించిన కోదండరాం మొత్తం 1,03,030 ఓట్లతో కోదండరాం మూడో స్థానంలో నిలిచారు.

ఇక నియోజకవర్గంలో విస్తృత పాదయాత్ర, తన వెబ్‌ చానల్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ కుటుంబాన్ని, బోగస్‌ ఓట్ల నమోదును ప్రశ్నించడంతో తీన్మార్‌ మల్లన్న.. యువకులు, యువ ఉద్యోగులకు బాగా దగ్గరయ్యారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడం, ప్రొఫెసర్‌గా, ఉద్యమ నాయకుడిగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులతో బలమైన సంబంధాలు ఉండడంతో కోదండరామ్‌కు ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయని పలువురు భావించారు. కానీ, ఇవేమీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాయి. స్వతంత్ర అభ్యర్థి మల్లన్నే కోదండరామ్‌కు మించిన పోటీ అధికార పార్టీకి ఇచ్చారు.

ఇక హైదరాబాద్‌ స్థానం నుంచి ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ పోటీలో ఉన్నారు. ఈయనకు యువతలో బాగానే ఫాలోయింగ్‌ ఉంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలపై ఈయన విశ్లేషణలు ఆకట్టుకుంటాయి. అలాగే విద్యాబోధన ద్వారా వేలాది మందిని తీర్చిదిద్దారు. దీంతో ఈయన గెలుపుపై చాలా మంది నమ్మకం కనబరిచారు. మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్లు చీలిపోయి అది నాగేశ్వర్‌కు వరంగా మారుతుందని భావించారు. తీరా ఫలితాలు చేస్తే ఆ అంచనాలన్నీ తపాయి. కె.నాగేశ్వర్‌కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. అయినా ఫలితం లేకపోయింది. కేవలం స్వతంత్ర అభ్యర్థి కే నాగేశ్వర్‌కు 53,610 మాత్రమే సాధించారు. మొత్తంమ్మీద అక్కడ, ఇక్కడ కూడా పట్టభద్రులు ప్రొఫెసర్లను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.