iDreamPost
android-app
ios-app

తక్కువ విలువకే హిందూస్థాన్ జింక్ ను అమ్మేశారా?

  • Published Feb 12, 2022 | 11:29 AM Updated Updated Feb 12, 2022 | 11:29 AM
తక్కువ విలువకే హిందూస్థాన్ జింక్ ను అమ్మేశారా?

పెట్టుబడుల ఉపసంహరణ, వ్యూహాత్మక అమ్మకం (స్ట్రాటజిక్ సేల్).. ఇలా పేర్లు ఏవైనా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఒకటే. ఏదో ఒక కారణంతో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమే. వందశాతం వాటాల విక్రయంపేరుతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టిన కేంద్రం.. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో భీమా రంగంలో దిగ్గజ కంపెనీ ఎల్ఐసీ షేర్ల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితమే అప్పటి ఎన్డీయే సర్కారు ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి తెర తీసింది. అలా అప్పట్లో హిందూస్థాన్ జింక్ కర్మాగారాన్ని అమ్మేయడంపై కొత్త అనుమానాలు రేగుతున్నాయి. ఆ సంస్థ విలువను బాగా తగ్గించి, తక్కువ ధరకు వాటాలు విక్రయించారన్న అనుమానాలను సీబీఐ దర్యాప్తు, సుప్రీంకోర్టు విచారణ సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బలపరుస్తున్నాయి.

లాభదాయక సంస్థను కారుచౌకగా..

1971-74 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం విశాఖలో హిందూస్థాన్ జింక్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. గాజువాక సమీపంలోని మింది, ములగాడ, చుక్కవానిపాలెం, నక్కవానిపాలెం గ్రామాలకు చెందిన 360 మంది రైతుల నుంచి 365 ఎకరాలు సేకరించారు. మంచి లాభాలతో నడుస్తున్న ఈ కర్మాగారాన్ని 2002లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం అమ్మేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ. 10 వేల కోట్ల రిజర్వు నిధులున్న ఈ సంస్థలో 26 శాతం వాటాలను కేవలం రూ.445 కోట్లకే వేదాంత గ్రూపునకు అమ్మేసింది. ఈ ఒప్పందానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సహకరించారు. ఆ తర్వాత 2013 వరకు విడతలవారీగా మొత్తం 73 శాతం వాటాలను అదే వేదాంతకు అమ్మేసింది. దీనిపై సంస్థ ఉద్యోగులు, భూములు ఇచ్చిన రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గత నవంబరులో ఈ వివాదం సుప్రీంకోర్టు ముందుకు రాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇటీవల విచారణ సందర్భంగా కోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. వాటాల విక్రయానికి సంబంధించి కొన్ని అంశాలు పేర్కొనడంతో పాటు కొందరి పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక పిటిషన్ దాఖలు చేసి.. జింక్ విక్రయం నిబంధనల ప్రకారమే జరిగినందున సీబీఐ విచారణ అవసరం లేదని వాదించింది. అయితే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చివరికి పిటిషన్ ఉపసంహరించుకుంది. ఈ సందర్భంగా సీబీఐ నివేదికలో కొన్ని పేర్లు ప్రస్తావించారని.. దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని బయటకు చెప్పడంలేదని వ్యాఖ్యానించి.. దర్యాప్తు కొనసాగింపునకు ఆదేశించారు. ఈ పరిణామాలు వాస్తవ విలువ కంటే తక్కువ ధరకు జింక్ కంపెనీ వాటాలు విక్రయించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాగా సంస్థను స్వాధీనం చేసుకున్న వేదాంత గ్రూప్.. దాన్ని నడపకపోగా.. వందలాది ఉద్యోగులు, కార్మికులకు ఇప్పటికీ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదు.

Also Read : లోకేష్‌ నిజాలే చెబుతున్నారా..?