Idream media
Idream media
ఏఐఎంఐఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసద్‌కు జెడ్ కేటగిరీ (సీఆర్‌పీఎఫ్) భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో గురువారం ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. అసద్ ప్రయాణిస్తున్న కారుకు బుల్లెట్లు తగిలాయి. ఈ నేపథ్యంలోనే అసద్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్ కమాండోలు 24 గంటల పాటు అసద్ భద్రతను పర్యవేక్షించనున్నారు.
గురువారం హాపుర్–గాజియాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్స్ టోల్‌ప్లాజా వద్ద అసద్ వాహనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అసద్ కారు కింద భాగంలోకి, టైర్‌లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. టైర్ పంక్షర్ కావడంతో అసద్ మరో వాహనంలో ఢిల్లీకి వెళ్లారు. దుండగులు కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీటీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్, శుభంగా గుర్తించారు. ఒవైసీ చేస్తున్న హిందూ వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు వారి మనోభావాలు దెబ్బతీయడంతోనే కాల్పులు జరిపినట్లు నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి.
సహజంగా బీజేపీ, ఎంఐఎం మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఎంఐఎం అక్కడ పోటీ చేస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఎన్నికల సమయంలోనూ ఒవైసీ బీజేపీ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ పరిధికే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను విమర్శించడం.. కమలం నేతలకు ఏ మాత్రం రుచించదు. లోక్‌సభలోనూ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుంటారు.
ఇలా ఉప్పు – నిప్పు మాదిరిగా ఉండే బీజేపీ, ఎంఐఎంలు పార్టీలు తాజాగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నాయి. ప్రధాన పోటీ ఎస్పీ, బీజేపీ మధ్య జరుగుతున్నా. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే.. ప్రాంతాల్లో ఎంఐఎం తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ప్రచారం ముగించుకుని వస్తున్న అసద్‌పై జరిగిన కాల్పుల ఘటన బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. ఉత్తరప్రదేశ్‌లో మాఫియాను అంతం చేశామని, శాంతిభద్రతలకు పెద్దపీట వేశామని బీజేపీ నేతలు, ముఖ్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతి సభలోనూ చెబుతున్నారు. బీజేపీ ఇలా చెబుతుండగా.. అందుకు భిన్నంగా ఏకంగా ఐఎంఐ అధినేతపై కాల్పులు జరగడంతో కమలం నేతలు ఖంగుతిన్నారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా వెంటనే అసద్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read : అసదుద్దీన్ కాన్వాయ్‌పై కాల్పులు.. యూపీలో హైటెన్షన్