iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ వెళ్లొచ్చాక‌ గ‌వ‌ర్నర్ కు ఢిల్లీ పిలుపు.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

జ‌గ‌న్ వెళ్లొచ్చాక‌ గ‌వ‌ర్నర్ కు ఢిల్లీ పిలుపు.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఐదు రోజుల క్రిత‌మే ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్‌ షాతో సహా రైల్వే మంత్రి పీయుష్‌గోయెల్‌, నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్‌, పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీటి ఆయోగ్‌వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ల‌ను క‌లిశారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని కూడా లేవ‌నెత్తారు. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కేంద్ర పెద్ద‌ల నుంచి ఢిల్లీ కి రావాల‌ని పిలుపు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎవరెవరిని కలవనున్నారు? అన్న విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం చూస్తే.. ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు.. సీఎం తన ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందుకు తీసుకొచ్చిన అంశాల మీద ఫీడ్ బ్యాక్ అడిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల గురించి కూడా తెలుసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

ఏపీలో తాజాగా పేద‌ల ఇళ్ల నిర్మాణాలు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. ఏక‌కాలంలో 15 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగుతుండ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌లే కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా దీనిపై ప్ర‌శంస‌లు కురిపించారు. దీంతో పాటు వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న తీరు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల వివ‌రాల‌పై గ‌వ‌ర్న‌ర్ చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఏపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఇటీవ‌లే విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. అంతేకాకుండా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌పై కూడా గ‌వ‌ర్న‌ర్ తో చ‌ర్చించే చాన్స్ ఉంది.