Idream media
Idream media
మానవజాతి మనుగడకు కరోనా వైరస్ పెను ముప్పుగా మారుతోంది. మానవ మేథస్సును సవాల్ చేస్తోంది. రూపు మార్పుకుంటూ అంతుచిక్కకుండా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం ఆవిరయ్యేలా.. వైరస్ కొత్త రూపును సంతరించుకుని విజృంభిస్తోంది. తాజాగా బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ వైరస్ ఆ దేశాన్ని వణికిస్తోంది. ఇతర దేశాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. బ్రిటన్‌తో రాకపోకలను అన్ని దేశాలు బంద్ చేసుకున్నా.. ఇప్పటికే స్ట్రెయిన్ వైరస్ ఇతర దేశాలకు వ్యాపించింది. భారత్‌లోకి ఈ వైరస్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది మార్చి నుంచి భారత్ దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతులేనిది. ఈ మహమ్మారి బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామనుకునేలోపు కరోనా వైరస్ కొత్త వెర్షన్ తన ప్రభావాన్ని బలంగా చాటుతోంది. బ్రిటన్‌లో ఒక్క రోజులోనే 36వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఈ వైరస్ వ్యాప్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆ దేశంలో కరోనా వైరస్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఒక్క రోజులో కేసులు నమోదు కాకపోవడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం.
ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజుకు 25 వేల కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య కోటి దాటింది. అయితే కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండడం ఎంతో ఊరటనిస్తోంది. వైరస్ బలహీనపడడంతో బాధితులు వేగంగా కోలుకుంటున్నారని వైద్యు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ దేశంలో స్ట్రేయిన్ వైరస్ వ్యాపిస్తే.. మనుపటి స్థితి వస్తుందన్న ఆందోళన నెలకొంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల దేశ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉపాధి, ఉద్యోగాలు పోయి.. ఆర్థిక కష్టాలు పెరిగాయి. మళ్లీ లాక్‌డౌన్ అంటే.. పరిస్థితి ఊహించలేని విధంగా ఉంటుంది.
కొత్త వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండడం ఎంతో అవసరం. దీర్ఘకాలిక ప్రణాళికతో వైద్య సదుపాయాలు, రక్షణ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. లేదంటే కరోనా వైరస్ విజృంభించిన సమయంలో పడిన పాట్లు.. మళ్లీ ఎదుర్కొవాల్సి వస్తుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కునే క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు.. అప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు, మౌలిక వసతులను ఉపయోగించుకున్నాయి. కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోలేదన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఎంతో కొంత నిధులు ఇచ్చింది కానీ.. శాశ్వత ప్రాతిపదికన ఆస్పత్రులను మాత్రం ఏర్పాటు చేసే ఆలోచన చేయలేదు.
ఒక దానికి వ్యాక్సిన్ కనిపెట్టేలోగా వైరస్ తన రూపు మార్చుకుంటున్న తరుణంలో దీర్ఘకాలిక సన్నద్ధత అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించాలని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు ప్రాధమిక, సామాజిక, ఏరియా, జిల్లా తదితర సాధారణ ఆస్పత్రులనే ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. దీని వల్ల సాధారణ వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు కరోనా వైరస్‌కు చికిత్స అందించే కేంద్రాలుగా మారడం వల్ల సామాన్యులు ఇతర ఆనారోగ్యాలకు చికిత్సకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు తమకుతాముగా మూసేసుకోవడంతో వైద్య సేవలకు దేశంలో తీవ్ర ఆటకం ఏర్పడింది. ఈ పరిస్థితి మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే కనీసం జిల్లాకు వెయి పడకల సామర్థ్యంలో ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్మించాల్సిన అవసరం ఎంతో ఉంది. అభివృద్ధి పనులను తాత్కాలికంగా వాయిదా వేసి.. ఆ నిధులను ఆస్పత్రుల నిర్మాణం కోసం ఖర్చు చేయడం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అత్యవసరం. పరిస్థితి చేయి దాటక ముందే సిద్ధంగా ఉండడం వల్ల ఆత్మనిర్భర్ భారత్ అంటూ నష్టపోయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉండబోదన్నది కాదనలేని సత్యం.
Read Also : మౌనం ముని..మహా మేధావి