Idream media
Idream media
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుతో మ్యుటేషన్ చేశారు. ఈ భూ కుంభకోణంలో మార్కాపురం మండల తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అందరూ భాగమైయ్యారు. ప్రభుత్వ భూములను అక్రమంగా మ్యూటేషన్ చేయడంపై అధికారులకు సమాచారం అందడంతో.. విచారణ చేపట్టారు. తమకు వచ్చిన ఫిర్యాదులు వాస్తవమని తేలడంతో బాధ్యులపై చర్యలు చేపట్టారు.
Also Read:సీటు బెల్టు పెట్టుకోలేదు.. ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదు.. ఎమ్మెల్యే కుమారుడు దుర్మరణం
ఒక్క నెలలోనే 378 ఎకరాలు..
మార్కాపురం మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను అధికారులు ఇతరులకు అన్యాక్రాంతం చేశారు. భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని అక్రమంగా ప్రభుత్వ భూములను మ్యూటేషన్ చేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు 378.89 ఎకరాల ప్రభుత్వ భూములను ఇతరుల పేరుపై మార్చారు. 17 గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములతో పాటు ప్రయివేట్ వ్యక్తుల భూములు కూడా ఇతరుల పేరు పై మార్చారు. ఇలా మొత్తం 702.01 ఎకరాలు అక్రమంగా మ్యూటేషన్ చేశారు. ఈ భూ కుంభకోణంలో తహసీల్దార్ విద్యాసాగరుడు ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు.
తహసీల్దార్ పై క్రిమినల్ చర్యలు..
ఈ కుంభకోణంపై విచారణ జరిపిన వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి సరళవందనం తన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ కుంభకోణానికి ప్రధాన కారకుడు రిటైర్డ్ తహసీల్దార్ విద్యాసాగరుడని తేల్చారు. ఏఆర్‌ఐ గోపీ, 17 రెవెన్యూ గ్రామాల వీఆర్‌వోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారని తన నివేదికలో పొందుపరిచారు. విద్యాసాగరుడుపై క్రిమినల్ చర్యలుచేపట్టాలని సిఫార్సు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మార్కాపురం – 4 వీఆర్‌వో కోటయ్య, రాయవరం – 1 వీఆర్‌వో జి.సుబ్బారెడ్డిలు సస్పెండయ్యారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్.నాగరాజును విధుల నుంచి తొలగించాలని విచారణ అధికారి సిఫార్సు చేశారు. అక్రమంగా మ్యూటేషన్ చేసిన భూములను గుర్తించి.. వాటిని వెబ్‌ల్యాండ్‌లో సరిచే సేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మార్కాపురం ఆర్‌డీవోను ఆదేశించారు.
Also Read : గౌరు కుటుంబం పోగొట్టుకుంది కేవలం పదవి మాత్రమేనా..?