Idream media
Idream media
ముఖ్యమంత్రి తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిరంతరం శ్రమించేవారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రగతిపథంలో పయనించాలంటే త్వరితగతిన పారిశ్రామికంగా వృద్ది సాధించాలని తపన పడేవారు. ఆ దిశగానే నిరంతరం అడుగులు వేసేవారు. రెండున్నరేళ్ల కాలంలోనే స్వతహాగానే పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచుకున్నారు. తాజాగా దుబాయిలో జరిగిన ఎక్స్ పోలో కూడా విదేశీ సంస్థలతో ఆరు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో 5 వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు రానున్నాయని రెండు రోజుల క్రితం కూడా సంతోషంగా ప్రకటించారు గౌతమ్ రెడ్డి.
ఏపీని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు గౌతమ్ రెడ్డి చేసిన కృషి మరువలేనిది. కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆకర్షించిన పెట్టుబడుల విషయంలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడంలో జగన్ తో పాటు గౌతమ్ కృషి అపారం. కడప జిల్లాలో ఎలక్ట్రానిక్, లెదర్ కాంప్లెక్స్, కృష్ణపట్నం వద్ద 3 వేల కోట్లతో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు.. నాలుగు నుంచి ఆరు ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకునేలా చేశారు. సాధారణంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉంటాయి. వీటితో ఏపీ పోటీ పడేలా చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల పెట్టుబడులు కూడా ఏపీకి వచ్చేలా చేశారు.
ఇటీవల దుబాయ్ ఎక్స్‌పో–2020లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించిన ఏపీ పెవిలియన్‌కు విశేష స్పందన వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడానికి అనేక సంస్థలు ఆసక్తిని కనబరిచాయని ఇటీవల ఆయన ప్రకటించారు కూడా. సీఎం వైఎస్ జగన్ ‘నవరత్నాలు’ పేరుతో రాష్ట్రంలో సాధిస్తున్న సుస్థిరమైన అభివృద్ధితో పాటు 11 రంగాలకు చెందిన 70 ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలను దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధానంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఆయన స్పీచ్ సంబంధిత వీడియోలు చాలా మంది స్టేటస్ లలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి కూడా.
రెండు రోజుల క్రితం.. రాష్ట్రంలో రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెబుతూ వాటిని వివరించారు. హైపర్ రిటైల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో పెట్టుబడులకు రీజెన్సీ గ్రూపుతో ఒప్పందం జరిగిందన్నారు. అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్స్ (అలుబండ్ అనుబంధ సంస్థ), ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసిస్ ఈ మొబిలిటీ, స్మార్ట్ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,800 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉండడం సంతోషకరమని ప్రకటించిన గౌతమ్ ఇంతలోనే అందరిలోనూ విషాధాన్ని నింపడం బాధాకరం.