iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చాలామంది యువకులున్నారు. కొందరు మాటల్లో దూకుడు ప్రదర్శిస్తే మేకపాటి గౌతమ్ రెడ్డి చేతల్లో దూకుడు ప్రదర్శించారు. వివాదరహితంగా మెలిగారు. అందరివాడిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో సౌమ్యంగా పనులు చక్కదిద్దడంలో సమర్థతను చాటారు. కీలక శాఖలకు నాయకత్వం వహిస్తూ తనదైన పంథాలో ముందుకు సాగారు. కోవిడ్ కారణంగా విశ్వవ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి గడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్నంతలో మెరుగైన రీతిలో పెట్టుబడుల సమపార్జనకు చివరివరకూ ప్రయత్నించారు. రెండురోజుల ముందు కూడా దుబాయ్ ఎక్స్ పోలో పలు ఎంవోయూలను ఆయన చేసుకున్నారు. వివిధ కంపెనీలు ఏపీ వైపు ఆకర్షించేందుకు చివరివరకూ ప్రయత్నించారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో శ్రమించిన గౌతమ్ రెడ్డి అనూహ్యంగా అందని దూరాలకు వెళ్లిపోవడం అందరినీ కలచివేస్తోంది.
రాజకీయాల్లో గౌతమ్ రెడ్డిది ప్రత్యేక పంథా. యూకేలో ఎమ్మెస్సీ విద్యనభ్యసించిన తర్వాత తండ్రిబాటలో వ్యాపార నిర్వహణలో సమర్థతను చాటారు. వైఎస్ జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రాజకీయాల్లో ప్రవేశించి వరుసగా రెండుసార్లు ఆత్మకూరులో విజయకేతనం ఎగురవేశారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఒకసారి ఎమ్మెల్యే, ఐదు మార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బాటలోనే విజయపరంపర సాగించారు. జగన్ క్యాబినెట్ లో సమర్థుడైన మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి కి గుర్తింపురావడం వెనుక తీవ్రంగా శ్రమించారు.
స్థానికంగా ఆత్మకూరు నేతలకు అందుబాటులో ఉంటూనే రాష్ట్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా జగన్ టీమ్ లో ఆయనది కీలకపాత్ర . ముఖ్యమంత్రి మనసెరిగి వ్యవహరించడంలో గౌతమ్ రెడ్డి దిట్ట. తన ఆరోగ్యపరమైన అంశాల్లో పలు జాగ్రత్తలు పాటించే గౌతమ్ రెడ్డి అనూహ్యంగా దూరంకావడం ఆయన అభిమానులతో పాటుగా వైఎస్సార్సీపీ శ్రేణులను కలచివేసింది. పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పనులు చక్కదిద్దడానికి ప్రాధాన్యతనిచ్చే గౌతమ్ రెడ్డి లేని లోటు ఆయన కుటుంబం, వైఎస్సార్సీపీ పార్టీతో పాటుగా ఏపీకి కూడా తీరనిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా యువనాయకుడిగా ఎదుగుతున్న దశలో ఆయన దూరం కావడం విషాదంలో ముంచింది.
హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి చేరుకునేలోగానే ఆయన తుది శ్వాస విడిచినట్టు అధికారికంగా ప్రకటించారు. ఉదయం 8.45 నిమిషాల ప్రాంతంలో ఆయన మరణించారు. కోవిడ్ అనంతరం కోలుకుని దేశ, విదేశాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరయిన వేళ ఆయన తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల కోసం పరితపించారు. ఇలాంటి తరుణంలో గౌతమ్ రెడ్డి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మంత్రి మేకపాటి గౌతమ్ హఠాన్మరణం