Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం అందరినీ కలిచివేస్తోంది. ఎప్పుడూ సంతోషంగా, ధృడంగా కనిపించే ఆయన గుండెపోటుతో చనిపోయారన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే గౌతమ్‌రెడ్డి మృతి చెందినప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై ఆయన కుటుంబం స్పందించింది. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.
గౌతమ్‌రెడ్డి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం..
– ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్‌లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరారు.
– 06.00 గంటలకు రోజూలాగే ఉదయాన్నే ఆయన మేల్కొన్నారు.
– 06:30 గంటల వరకూ మంత్రిగారు ఫోన్లతో కాలక్షేపం చేశారు.
– 07.00 గంటలకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో మంత్రి కూర్చుని ఉన్నారు.
– 07:12 గంటలకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు.
– 07:15గంటలకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోఫా నుంచి ఆయన మెల్లిగా కిందకి ఒరిగారు.
– 7:16 గంటలకు మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి కంగారు పడి గట్టిగా అరిచారు.
– 07:18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతి మీద చేయితో నొక్కి డ్రైవర్ నాగేశ్వరరావు స్వల్ప ఉపశమనం కలిగించారు.
– 07:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు.
– 07:20 గంటలకు మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భార్య శ్రీకీర్తి.. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు.
– 07:22 ‘నొప్పి పెడుతుంది కీర్తి’ అంటున్న మంత్రి మాటలకు స్పందించి.. అక్కడి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు.
– 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటి డ్రైవర్, సిబ్బంది చేర్చారు.
– 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.
– 09:13 గంటలకు మంత్రి మేకపాటి ఇకలేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
– 09:15 గంటలకు మంత్రి మేకపాటి మృతిచెందినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు.