iDreamPost
iDreamPost
రెబెల్ స్టార్ గా డార్లింగ్ గా అభిమానులు పిలుచుకునే ప్రభాస్ ప్రతి సినిమాకూ ఎదురు చూపులు తప్పడం లేదు. కనీసం రెండేళ్లు గ్యాప్ లేనిదే రిలీజులు కష్టమైపోయింది. పోనీ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను ఫాస్ట్ గా చేద్దామంటే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వల్ల మేజర్ బ్రేక్ పడిపోయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో అంతు చిక్కని పరిస్థితి. ఇదిలా ఉండగా నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రాల ప్రొడ్యూసర్ అశ్వినిదత్ నిర్మించబోతున్న ప్రభాస్ 21 మీద అప్పుడే చిత్ర విచిత్రమైన పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఓ మానవుడికి, దేవకన్యకు పుట్టిన హీరో ఎలాంటి అద్భుతాలు చేస్తాడనే పాయింట్ మీద దీని కథ రాసుకున్నట్టుగా ఓ మీడియా వర్గంలో తెగ ప్రచారం జరుగుతోంది. అంటే 30 ఏళ్ళ క్రితం ఇదే సంస్థ రూపొందించిన క్లాసిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి కొనసాగింపుగా ఇది ఉంటుందన్న మాట. అయితే ఇటీవలే అశ్వినీదత్ ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలలో జవీఅసుందరికి సీక్వెల్ తీస్తానని ఆ తర్వాతే రిటైర్ అవుతానని చెప్పారు. అలాంటప్పుడు ప్రభాస్ మూవీ దానికి కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ చేయాలనుకున్నా మెగా హీరోస్ లో ఒకరు అందులోనూ రామ్ చరణ్ ని తప్ప ఆ రోల్ లో ఇంకొకరిని చూసేందుకు సగటు అభిమానులు ఇష్టపడకపోవచ్చు.
అలాంటాప్పుడు ఎంత ప్రభాస్ అయినా ఇలాంటి రిస్క్ తీసుకోరు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అలాంటిదేమి లేదట. సూపర్ హీరో తరహాలో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని ఎవరూ ఊహించని కథా కథనాలతో నాగ అశ్విన్ మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు. మొత్తానికి ఇది జగదేకేవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ కాదనేది అర్థమవుతోంది. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రానికి వైజయంతి సంస్థలోనే అత్యంత భారీ బడ్జెట్ ని కేటాయించబోతున్నారు. హీరోయిన్ సెలక్షన్ తో పాటు మిగిలిన టీమ్ ని సెట్ చేసుకోవడంలో నాగ అశ్విన్ బిజీగా ఉన్నాడు. ఇంత భారీ విజువల్ వండర్ కి సంగీత దర్శకుడు ఎవరనే ఉత్సుకత ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. లాక్ డౌన్ అయ్యాక ఒక్కో విషయానికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.