iDreamPost
android-app
ios-app

ఉంటే అసెంబ్లీలో.. లేదంటే ప్రజల్లో..! -నిరాడంబరంగా గోపాలపురం ఎమ్మెల్యే

  • Published Feb 03, 2022 | 1:12 PM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
ఉంటే అసెంబ్లీలో.. లేదంటే ప్రజల్లో..!  -నిరాడంబరంగా గోపాలపురం ఎమ్మెల్యే

ధనమేరా అన్నిటికీ మూలం అన్నట్లు నేటి రాజకీయాలు తయారయ్యాయి. డబ్బు, దర్పం, అధికార హోదాలు రాజకీయాలను శాసిస్తున్న ఈ రోజుల్లో నిబద్ధతతో, నిరాడంబరంగా ప్రజలకోసం పనిచేసే ప్రజాప్రతినిధులు అరుదుగా కనిపిస్తున్నారు. వార్డు సభ్యుడిగా ఎన్నికైతే చాలు కార్లలో తిరుగుతూ దర్జా ఒలకబోసే వారే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అటువంటివారికి తాను భిన్నమని నిరూపిస్తున్నారు. నిత్యం స్కూటీలో తిరుగుతూ.. ప్రజలతో మమేకం అవుతూ.. పొలం పనులు స్వయంగా చేసుకుంటూ నిన్నటి తరం ప్రజాప్రతినిధులను గుర్తుకు తెస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో రాజధానిలో ఉండటం.. మిగతా రోజుల్లో సొంత ఊరిలోనే ప్రజల మధ్య గడుపుతున్నారు.

తొలిసారి ఎమ్మెల్యేగా

మండల కేంద్రమైన దేవరపల్లికి చెందిన తలారి వెంకటరావు తొలినాళ్లలో కాన్షీరాం స్పూర్తితో బహుజనుల సమస్యలపై పనిచేసేవారు. తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మారి కాంగ్రెసులో చేరారు. ఆయన తదనంతరం వైఎస్సార్సీపీలో చేరి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో గోపాలపురం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. అయినా పట్టువీడకుండా పనిచేసి 2019లో మళ్లీ పోటీ చేసి జగన్ హవాలో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర రావుపై 37 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ఎమ్మెల్యేగా పేరుపొందారు.

ప్రజల్లో.. పొలంలో..

ఎమ్మెల్యే వెంకటరావు నిత్యం తెల్లవారుజామునే తన స్కూటీపై దేవరపల్లిలోని తన ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పొలానికి వెళతారు. అక్కడ ఆవులు, గేదెలకు దాణా పెట్టి స్వయంగా పాలు పితికి అమూల్ డైరీకి సరఫరా చేస్తారు. అనంతరం కోళ్ల ఫారంలో కొంత సమయం గడుపుతారు. ఆ తర్వాత నుంచి మిగిలిన సమయం అంతా ప్రజలకు అందుబాటులో ఉంటారు. తన వద్దకు వచ్చే ప్రజలు చెప్పే సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. ఎమ్మెల్యే అన్న దర్పం లేకుండా వారితో మమేకం అవుతుంటారు. స్కూటీపై తిరుగుతూ ఎదురుపడిన వారితే రోడ్లపైనే నిలబడి మాట్లాడుతూ మంచిచెడ్డలు ఆరా తీస్తుంటారు. ఎమ్మెల్యే అయి ఉండి పొలం పనులు చేయడమేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే చిన్నప్పటి నుంచి పొలం పనులు, పశుపోషణపై ఆసక్తి ఉందని వెంకటరావు చెబుతుంటారు. అదీకాక ఏదో ఒక పని చేయకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తుంటారు.