గుడ్ బై రిపోర్ట్

విక్రమ్ వేదా తర్వాత బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రిలీజ్ నిన్న వచ్చిన గుడ్ బై ఒక్కటే. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఇది. అంత పెద్ద దిగ్గజంతో అతి తక్కువ టైంలో అవకాశం దక్కడం పట్ల శ్రీవల్లి పలు సందర్భాల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చింది. ట్రైలర్ చూశాక మన ఆ నలుగురు తరహాలో ఇది మంచి ఎమోషనల్ డ్రామా అన్న ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. కాకపోతే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో మాస్ కి కనెక్ట్ అవ్వడం మీద అనుమానం లేకపోలేదు. ఓపెనింగ్స్ కూడా సోసోగాన్ ఉన్నాయి. ఒకేవారంలో గాడ్ ఫాదర్ తో తలపడిన ఈ గుడ్ బై ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

అనగనగా ఒక కుటుంబం. ఇంటి పెద్ద గాయత్రి భల్లా(నీనా గుప్తా) హఠాత్తుగా చనిపోతుంది. భర్త హరీష్ భల్లా(అమితాబ్ బచ్చన్ )అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తాడు. చుట్టుపక్కల స్నేహితులు లేడీసు కలిసి సంతాపంగా పెట్టుకున్న వాట్సప్ గ్రూప్ ఏ పేరు పెట్టాలని తర్జనభర్జన పడుతుంటారు. చావు కబురు గాయత్రి పిల్లలకు చేరుతుంది. అప్పుడే మొదటి కేసు గెలిచిన కూతురు తారా( రష్మిక మందన్న)ఆ ఆనందాన్ని ఆస్వాదించుకుండానే ఈ విషాదాన్ని చూస్తుంది. అమెరికా, దుబాయ్ లో ఉన్న కొడుకులు అక్కడి నుంచి బయలుదేరుతూ తమకు కావాల్సిన తిండిని మిస్ కాకుండా చూసుకుంటారు. ఆ తర్వాత జరిగే శవయాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.

దర్శకుడు వికాస్ బల్ తీసుకున్న పాయింట్ మారుతీ ప్రతి రోజు పండగ నుంచి తీసుకున్నట్టు కనిపిస్తుంది. చావు మీద కామెడీని నడిపించి ఎంటర్ టైన్ చేయాలనుకున్న ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది. ఎంత నవ్వించే ఉద్దేశమే అయినా దాని కోసం రాసుకున్న సన్నివేశాలు మరీ కృతకంగా, అతిగా ఉండటంతో ఫీలవ్వాల్సిన ఎమోషన్ కాస్తా ఇరిటేషన్ గా మారిపోతుంది. ఎంత మెకానిక్ లైఫ్ అయినా సరే మరీ భావోద్వేగాలే ఉండవన్నట్టు చూపించిన తీరు బాలేదు. చాలా మంచి క్యాస్టింగ్ దొరికినప్పటికీ వికాస్ బ్యాడ్ రైటింగ్ తో సరిగా వాడుకోలేకపోయాడు. అంతర్లీనంగా చెప్పాలనుకున్న సందేహం బాగానే ఉంది కానీ దాన్ని బలంగా చెప్పగలిగే ప్రెజెంటేషన్ తోడైతే గుడ్ బై బాగుండేది. అందుకే ఈ సినిమాకు వెల్కమ్ చెప్పలేం

Show comments