iDreamPost
iDreamPost
దసరా పండక్కు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టింది. ఓవర్సీస్ లోనూ 1 మిలియన్ మార్క్ దాటేసి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి తర్వాత ఆ ఫీట్ అందుకున్న మూడో సినిమాగా రికార్డు అందుకుంది. ఒకవేళ ఆచార్య హిట్ అయ్యుంటే అదీ చేరేది కానీ ఆ డిజాస్టర్ ప్రభావమే దీని బిజినెస్ మీద ప్రభావం చూపించింది. బుధవారం రిలీజ్ తో కలుపుకుని మొత్తం అయిదు రోజులు బాక్సాఫీస్ వద్ద మెగా డామినేషన్ స్పష్టంగా కనిపించింది. స్వాతిముత్యం బాగున్నప్పటికీ థియేటర్లకు జనం రాకపోగా నాగార్జున ది ఘోస్ట్ టోటల్ వాష్ అవుట్ వైపు పరుగులు పెడుతోంది. డబుల్ డిజిట్ షేర్ సాధ్యం కాబోవడం లేదు.
గాడ్ ఫాదర్ కు ఇవాళ నుంచి వసూళ్లు కీలకం కాబోతున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే 91 కోట్ల షేర్ రావాలి. ఇప్పటికి యాభై దాటింది. బాలన్స్ రాబట్టడం అంత సులభం కాదు. ఇంకో వారం పది రోజులు ఇదే తరహా స్ట్రాంగ్ రన్ కొనసాగించాలి. కానీ సోమవారం నుంచే గణనీయమైన డ్రాప్ కనిపిస్తోంది. మళ్ళీ వీకెండ్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బిసి సెంటర్ల పెర్ఫార్మన్స్ కీలకం కానుంది. ఎంత హిట్ టాక్ వచ్చినా గాడ్ ఫాదర్ దూకుడు కెజిఎఫ్, విక్రమ్, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో లేదు. అవి రెండు వారాలు ఏకధాటిగా పరుగులు పెట్టాయి. కానీ చిరు మాత్రం అంత స్పీడు చూపిస్తారానేది వేచి చూడాలి. ఈ వారం కంప్లీట్ అయ్యాకే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది.
వచ్చే వారం దీపావళికి చాలా సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఏదున్నా ఇప్పుడే చేసుకోవడం కీలకం. యుఎస్ తో పాటు ఇతర దేశాల్లో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ సమస్యలు వచ్చాయి. సెన్సార్ కాని కారణంగా ఆస్ట్రేలియాలో చాలా లిమిటెడ్ షోలు ఇచ్చారు. అక్కడ రెండు రోజుల కీలక కలెక్షన్లు కోల్పోవాల్సి వచ్చింది. వెడ్ నెస్ డే రిలీజ్ కావడంతో హిందీలోనూ 7 నుంచి స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. ముప్పై కోట్లు వచ్చాయని అంటుకున్నారు కానీ దానికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది. హిట్ అయిన ఆనందం ఫ్యాన్స్ కి మిగులుతున్నా మరోవైపు లాభాలు అందుకుంటుందానే టెన్షన్ కూడా కలుగుతోంది. ఫైనల్ ఫిగర్స్ వచ్చేదాకా ఇది తప్పదు