iDreamPost
android-app
ios-app

Godavari Districts – రెండు… ఇక ఆరు

  • Published Jan 26, 2022 | 4:00 AM Updated Updated Jan 26, 2022 | 4:00 AM
Godavari Districts  – రెండు… ఇక ఆరు

రెండు గోదావరి జిల్లాలు ఇక ఆరు జిల్లాలుగా మారనున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను జిల్లాగా మార్పు చేయనుంది. దీనిపై నేడో.. రేపో జీవో విడుదల కానుంది. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడంతో జిల్లాల ఏర్పాటు ఇక లాంఛనమే. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం… అట్టడుగు వర్గాల వద్దకు పాలనను మరింత చేరువు చేసేందుకు పార్లమెంట్‌ను ఒక జిల్లా చేస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా పార్లమెంట్‌ను ఒక జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇదే జరిగితే ఇప్పుడు రెండు జిల్లాలుగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలు ఇక ఆరు జిల్లాలుగా మారనున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా 19 అసెంబ్లీ నియోజకవర్గాలతో రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉంది. దీనికితోడు పోలవరం ముంపు మండలాలు కలవడంతో ఈ జిల్లా విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. విభజన అనంతరం కొత్తగా విలీన మండలాలు కలిసిన తరువాత ఈ జిల్లాను రెండుగా చేయాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే నాటి చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. జగన్‌ తన హామీకి కట్టుబడి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేయనున్నారు.

తూర్పు ప్రస్తుతం నాలుగు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఉంది. కాకినాడ, అమలాపురం పార్లమెంట్‌ స్థానాలు జిల్లాలోనే భాగంగా ఉన్నాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ అర్బన్‌, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలు కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోకి వస్తాయి. అలాగే అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ జిల్లాలో భాగంగా ఉన్నాయి. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ ఇటు తూర్పులోను, పశ్చిమలోను భాగంగా ఉంది. రాజమహేంద్రవరం అర్బన్‌, రాజమహేంద్రవరం రూరల్‌, అనపర్తి, రాజానగరం ఈ నాలుగు తూర్పు పరిధిలోను, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే నర్సాపురం పార్లమెంట్‌ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్‌ పశ్చిమ గోదావరితోపాటు కృష్ణా జిల్లాలో కూడా భాగంగా ఉంది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోను, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ స్థానాలు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నాయి.

తూర్పున ఏజెన్సీలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ జిల్లాలోని అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అరకు విస్తీర్ణం ఎక్కువ. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లా పరిధిలో అరకు, పాడేరు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రంపచోడవరం ఉన్నాయి. దీనిని రెండుగా చేసినా చోడవరం ఏదో ఒక జిల్లాలో ఉంటుంది. ఇక రెండు జిల్లాల్లో మిగిలిన ఐదు పార్లమెంట్‌ స్థానాలు కూడా జిల్లాలుగా మారనున్నాయి. మొత్తం మీద ఇప్పుడున్న ఉభయ గోదావరి జిల్లాలు.. ఆరు జిల్లాలుగా మారనున్నాయి.