Idream media
Idream media
వైసీపీ సర్కార్ ఏర్పడి మరో మూడు నెలకు రెండున్నరేళ్లు అవుతుంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో 80 శాతం మంది స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తద్వారా అసంతృప్తులకు ఆదిలోనే అడ్డుకట్టవేశారు. రాబోయే విజయదశమికి మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరుగుతుందనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాల వారీగా ఎవరికి వారు మంత్రి పదవి తమకే వస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. రాజకీయంగానూ క్యాలుక్యులేషన్స్ జోరుగా సాగుతున్నాయి.
మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగితే.. ఉభయగోదావరి జిల్లాలలో ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎవరికి అవకాశం వస్తుంది..? తూర్పుగోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 15 వెరసి ఉభయగోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మూడు నియోజకవర్గాల చొప్పన రెండు జిల్లాల్లో ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఐదు చోట్ల వైసీపీ గెలిచింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అమలాపురం నుంచి సీనియర్ నేత పినిపే విశ్వరూప్ గెలిచారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. పి.గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు గెలిచారు. 2014లో ఓడిపోయిన ఆయన 2019లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Also Read : దర్శిలో పావులు కదుపుతున్న బూచేపల్లి.. రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..?
పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నుంచి తానేటి వనిత గెలిచారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు. గోపాలపురం నుంచి తలారి వెంకటరావు గెలిచారు. చింతలపూడి నుంచి వి.ఆర్.ఎలిజా విజయం సాధించారు. వెంకటరావు, ఎలిజాలు ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. సీనియర్లు, జూనియర్లు అనే బేధం లేకుండా.. రాజకీయ, సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం వైఎస్ జగన్.. కేబినెట్‌లో స్థానం కల్పిస్తున్నారు. ఇందుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవికి దక్కడమే నిదర్శనం.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వవస్థీకరణ అంటూ జరిగితే.. జగన్ చెప్పినట్లుగా తూర్పుగోదావరిలో పినిపే విశ్వరూప్, పశ్చిమ గోదావరిలో తానేటి వనితల స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారు..? ఆరుగురు ఎస్సీ ఎమ్మెల్యేలలో జనసేన ఎమ్మెల్యేను, ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తున్న పినిపే విశ్వరూప్, తానేటి వనితలను మినహాయిస్తే.. మిగిలేది ముగ్గురు. కొండేటి చిట్టిబాబు, తలారి వెంకటరావు, వి.ఆర్.ఎలిజా.. వీరి ముగ్గురిలో ఎవరికి మంత్రి అయ్యే యోగం ఉందో చూడాలి.
Also Read : ఏమిటీ అగ్రిగోల్డ్ స్కామ్..? ప్రభుత్వం ఎందుకు డిపాజిట్లు చెల్లిస్తుంది ..?