iDreamPost
android-app
ios-app

గోవా మాజీ సీఎంకు అరుదైన గౌరవం – జీవితకాలం క్యాబినెట్ ర్యాంక్

గోవా మాజీ సీఎంకు అరుదైన గౌరవం – జీవితకాలం క్యాబినెట్ ర్యాంక్

రాజకీయాల్లో కొందరు నేతలు సంచలనాలు సృష్టిస్తారు. మరికొందరు వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తారు. ఇంకొందరు తమ రాజకీయ అనుభవంతో గౌరవం పొందుతారు. ఆ కోవకు చెందిన వ్యక్తే గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రతాప్‌ సిన్హ్‌ రాణే(87). ఆయనకు దేశంలోనే అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు.. ఆయనకు జీవిత కాల కేబినెట్‌ హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం ప్రమోద్‌ సావంత్‌ శుక్రవారమిక్కడ తెలిపారు.

మాజీ స్పీకర్‌ కూడా అయిన రాణే ప్రస్తుతం పొరీం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1987 నుంచి 2007 మధ్య వివిధ సందర్భాల్లో నాలుగు దఫాలు సీఎంగా పనిచేశారు. మాజీ సీఎంలు గానీ, మాజీ సభాపతులు గానీ.. ఎవరైతే ఎమ్మెల్యేగా 50 ఏళ్ల పదవీకాలం పూర్తిచేసుకుంటారో వారందరికీ భవిష్యత్‌లోనూ శాశ్వత కేబినెట్‌ హోదా ఇవ్వాలని తీర్మానించినట్లు సావంత్‌ మీడియాకు తెలిపారు.

రాణే కుమారుడు విశ్వజిత్‌ బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య మంత్రి కూడా. తన తండ్రికి ఇంత ప్రత్యేక గౌరవం ఇచ్చినందుకు సీఎం సావంత్‌కు, మొత్తం మంత్రివర్గానికి ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలియజేశారు. ‘సీఎంగా, స్పీకర్‌గా, ఎమ్మెల్యేగా 50 ఏళ్లు ప్రజాసేవలో ఉన్న నేతకు ఇంతకంటే గొప్ప గౌరవం లేదు. చాలా ప్రత్యేక అభినందన’ అని పేర్కొన్నారు.

Also Read : జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ : జడ్జీల నియామకాలపై ఎస్‌సీబీఏ ఆవేదన