iDreamPost
iDreamPost
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడుగా ముందుకు వెళ్తోంది. సమకాలీన రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. ప్రచారం, ఎన్నికల హామీలు, అభ్యర్థుల ఎంపికలో ఇతర పార్టీల కంటే ముందున్న ఆప్ ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటనలోనూ వినూత్న పంథా అనుసరిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ పేరు ప్రకటించిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒక్క రోజు వ్యవధిలోనే గోవా సీఎం అభ్యర్థిగా కొత్త ముఖాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గానికి చెందిన అమిత్ పాలేకర్ ను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ పనాజీలో బుధవారం ప్రకటించారు.
కుల సమీకరణ కాదు..
అమిత్ పాలేకర్ గోవాలో ఎక్కువ జనాభా ఉన్న భాండారీ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో ఈ వర్గంవారు 35 శాతం వరకు ఉంటారు. వినూత్న రాజకీయాలంటూ కులం కార్డ్ ప్రయోగించారన్న ఇతర పార్టీల ఆరోపణలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. తాము కుల రాజకీయాలు చేయడం లేదన్నారు. ఇప్పటివరకు పాలించిన పార్టీలే వెనుకబడిన భాండారీ సామాజికవర్గానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. వారికి న్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు భాండారీ సామాజికవర్గం నుంచి రవి నాయక్ ఒక్కరే సుమారు రెండేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సామాజిక ఉద్యమకారుడు..
న్యాయవాది అయిన అమిత్ పాలేకర్ సామాజిక ఉద్యమకారుడు. గత ఆక్టోబరులోనే ఆప్ ద్వారా రాజకీయాల్లో చేరిన ఆయన పలు సామాజిక అంశాలపై ఉద్యమాలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడే. కొన్నాళ్ల క్రితమే పురాతన వారసత్వ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేసి వార్తల్లో నిలిచారు. 46 ఏళ్ల పాలేకర్ ఈ ఎన్నికల్లో సెయింట్ క్రజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా కేజ్రీవాల్, పాలేకర్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతిని తుడిచేస్తామని హామీ ఇచ్చారు. గోవా మార్పు కోరుతోందని, తమ పార్టీకి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. 2017 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని ఆప్ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తోంది.
Also Read : పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్