Idream media
Idream media
ఫిరాయింపులకు పేరొందిన గోవాలో ఎన్నికలకు ముందు మరో కీలక నేత గోడ దూకేశారు.గత కొన్నేళ్లుగా అధికార బీజేపీ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కాషాయం కప్పేసింది.కానీ సరిగ్గా ఎన్నికల వేళ కమలం పార్టీకి కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది.
గోవా మంత్రి,బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో మంత్రి పదవితో పాటు తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కలంగుటే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మైఖేల్ బీజేపీ ఇప్పుడు సామాన్య ప్రజల పార్టీ కాదని ఓటర్లు నాకు చెప్పారంటూ గోవా అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా సమర్పించారు. రాష్ట్ర పోర్టు,వ్యర్ధాల నిర్వహణ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న లోబో బీజేపీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.
మంత్రి మైఖేల్ లోబో రాజీనామా గోవాలోని బర్దేజ్ ప్రాంతంలో బీజేపీ గెలుపు అవకాశాలపై పెను ప్రభావం చూపనుంది. ఆయన సొంత నియోజకవర్గం కలంగుటేతో సహా ఆరు అసెంబ్లీ స్థానాలు బర్దేజ్ పరిధిలో ఉన్నాయి.కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్న గోవాలో ఎన్నికల వేళ మంత్రి మైఖేల్ లోబో వంటి కీలక నేతని కోల్పోవడం అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.
కాగా అసెంబ్లీ ఎన్నికలలో మైఖేల్ లోబో తన భార్య డెలీలాకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.సియోలిమ్ స్థానం నుండి డెలీలా లోబోను ఎన్నికల బరిలో దింపేందుకు ఆయన సిద్ధపడ్డారు.కానీ బీజేపీ మొండి చేయి చూపింది.ఈ నేపథ్యంలో ఆదివారం కలంగుటే సమీపంలోని నియోజకవర్గమైన సాలిగావ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార ప్రారంభ కార్యక్రమంలో లోబో కనిపించారు. దీంతో ఆయన గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కాంగ్రెస్‌లో చేరికపై మైఖేల్ లోబో స్పష్టత ఇవ్వలేదు. ఇక నేను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ గరిష్ట సీట్లు గెలుస్తుందని మాత్రం ఆయన జోస్యం చెప్పారు.
2019లో మనోహర్ పారికర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్‌తో మైఖేల్ లోబోకు రాజకీయంగా విభేదాలు పొడచూపాయి.గత నెలలో మైఖేల్ పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు బీజేపీలో ప్రాముఖ్యత లేదు అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. తన రాజీనామా సందర్భంగా ప్రస్తుత గోవా బీజేపీ మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నిర్మించిన పార్టీ కాదని ఆయన విమర్శించారు. మనోహర్ పారికర్‌కు సన్నిహితంగా ఉండే నేతలను పార్టీలో పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు.బీజేపీని భిన్నత్వం ఉన్న పార్టీ అని అంటారు.కానీ అది ఇప్పుడు భిన్నత్వం ఉన్న పార్టీ కాదని తనకు జ్ఞానోపదేశం అయిందని మైఖేల్ లోబో వివరించారు.
ఇప్పటికే పార్టీ ఫిరాయింపులతో గోవా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక ఊహాగానాలు నిజమై మాజీ బీజేపీ నేత మైఖేల్ లోబో హస్తానికి షేక్ హ్యాండ్ ఇస్తే అది కాంగ్రెస్‌కి బిగ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read : ప్రధాని భద్రతలో వైఫల్యంపై విచారణకు సుప్రీం కమిటీ