iDreamPost
android-app
ios-app

గూడు చెదురుతున్న గోవా బీజేపీ

గూడు చెదురుతున్న గోవా బీజేపీ

గత ఎన్నికల్లో అతి తక్కువ సీట్లతో, పొత్తు పార్టీలతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. అనంతరం 2017లో జరిగిన ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కు సంఖ్యా బలాన్ని తగ్గిస్తూ.. బీజేపీ బలోపేతం అయింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఒకేసారి పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బీజేపీలో చేరారు. దీంతో 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో అప్పుడు బీజేపీ బలం 27కు పెరిగింది. ఇక అక్కడి నుంచి తిరుగులేకుండా బీజేపీ పాలిస్తూ వచ్చింది. ఐదేళ్లు పూర్తి చేసుకుని ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది.

కేంద్రంలో అధికారంతో పాటు.. గోవాలో కూడా బలమైన పార్టీగా ఎదిగిన బీజేపీ వచ్చే నెలలోనే ఎన్నికలు జరగనుండగా ఊహించని షాక్ లు తింటోంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచే పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు జరుగుతున్నప్పటి నుంచి పార్టీ వర్గాల్లో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. బీజేపీ తమకు టికెట్ ఇవ్వదని ముందే ఊహించిన కొందరు గత నెలలోనే పార్టీకి రాజీనామా చేశారు. జాబితా విడుదలయ్యాక తీవ్ర స్థాయికి చేరుకుంది.

ఈ నెల ప్రారంభం లోనే బీజేపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఎమ్మెల్యే ప్ర‌వీణ్ జంత్యే, మంత్రి మైఖేల్ లోబో కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ సామాన్యుల పార్టీ కాద‌ని, అందుకే గుడ్ బై చెప్పేస్తున్నాన‌ని లోబో ప్ర‌క‌టించారు. మాజీ సీఎం పారిక‌ర్ ఆలోచ‌న విధానంతో పార్టీ న‌డ‌వ‌డం లేద‌ని, ఆయ‌న వ‌ర్గీయుల‌కు ప్ర‌స్తుత నాయ‌క‌త్వం అంత‌గా గౌర‌వించ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. త‌మతో ప్ర‌స్తుత నాయ‌క‌త్వం గౌర‌వ‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆరోపించారు. అప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన మొదటి జాబితాలో పది మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వలేదు. వారిలో కూడా ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు.

టికెట్లు ఇవ్వలేదని కొందరు, విధానాలు నచ్చక మరికొందరు బీజేపీ ని వీడిపోయారు. మాజీ సీఎం, దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత..మరో గట్టి షాక్ తగిలింది. గోవా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఛాన్స్ ఇవ్వలేదని పేర్కొంటూ…పార్టీకి రాజీనామా చేయనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వెల్లడించారు. దీంతో ఆ పార్టీకి చెందిన వర్గాల్లో ఆందోళన వ్యక్తమయ్యింది.తన తండ్రి నియోజకవర్గమైన పనాజీ నుంచి పోటీ చేయాలని ఉత్పల్ పారికర్ భావించారు. కానీ ఆ సీటును ఇతరులకు ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నారు.

ఇక మాజీ సీఎం పర్సేకర్ మండ్రేమ్ అసెంబ్లీ స్థానం నుంచి 2002 నుంచి 2017 వరకు ప్రాతినిథ్యం వహించారు. 2014 నుంచి 17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఈయన ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దయానంద్ సోప్టేను బరిలోకి దింపింది. దీంతో పర్సేకర్ అలకబూని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఉప ఎన్నికలో టికెట్ ఆశించి బంగపడ్డ ఉత్పల్ పారికర్ పార్టీలో కొనసాగారు. కానీ తాజా ఎన్నికల్లో కూడా టికెట్ రాకపోవడంతో బీజేపీ కి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇలా ఎంతో మంది నేతలు, ఎమ్మెల్యే లు, తాజాగా మాజీ సీఎం నిర్ణయాలు బీజేపీ లో కలకలం రేపుతున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు కాషాయ పార్టీ ఖాళీ అవుతుండడం రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.