iDreamPost
android-app
ios-app

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలకు అనుగుణంగా ఎగ్జాట్‌ పోల్‌.. టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధిస్తుందా..?

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలకు అనుగుణంగా ఎగ్జాట్‌ పోల్‌.. టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధిస్తుందా..?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కౌటింగ్‌ కొనసాగుతోంది. 150 డివిజన్లకు గాను ఇప్పటి వరకు 149 డివిజన్లకు సంబంధించి లెక్కించిన ఓట్లను వెల్లడించారు. 149 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 70 డివిజన్లు, ఎంఐఎం 45, బీజేపీ 30, కాంగ్రెస్‌ నాలుగు డివిజన్లలో విజయం/ఆధిక్యంలో ఉన్నాయి.

149 డివిజన్లకు సంబంధించి దాదాపు 15 డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మిగతా డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న పార్టీ అభ్యర్థులు భారీ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎంఐఎం 45 డివిజన్లకుగాను ఇప్పటి వరకు డబిర్‌పురా, రామ్‌నస్‌పురా, కిషన్‌బాగ్, దూద్‌బౌలి, నవాబ్‌సాబ్‌కుంట, ఫత్తర్‌ఘట్, అహ్మద్‌నగర్, రియాసత్‌నగర్, పురాణాపూర్, చంద్రాయణగుట్టలో గెలిచింది. మిగతా డివిజన్లలో భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. ఆయా డివిజన్ల ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. ఎంఐఎం 45 సీట్లు గెలుచుకునేలా కౌటింగ్‌ ట్రెండ్స్‌ కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీలు కూడా తాము గెలుపు/ ఆధిక్యంలో ఉన్న 70, 30 స్థానాలకు రెండు మూడు స్థానాలు అటు ఇటుగా గెలుచుకునే అవకాశాలున్నాయి.

ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు అనుగుణంగా తుది ఫలితాలు వచ్చే అకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు సరాసరిగా టీఆర్‌ఎస్‌కు 70 స్థానాలకు, ఎంఐఎంకు 40, బీజేపీకి 30, కాంగ్రెస్, ఇతరులు 5 స్థానాల వరకూ గెలుస్తాయని వెల్లడించాయి. వీటికి అనుగుణంగానే ఎగ్జాట్‌పోల్‌ ఫలితాలు వెల్లడవుతున్నాయి.

ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయో దాదాపుగా అన్ని పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. దృష్టి టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే మేయర్‌ పీఠం కైవసం చేసుకుంటుందా..? లేదా..? అనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. 150 డివిజన్లు, 45 ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలపి 195 ఓట్లకు గాను.. మేయర్‌ స్థానం దక్కించుకోవాలంటే 98 ఓట్లు అవసరం.

టీఆర్‌ఎస్‌కు 31 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం ఉంది. ఇక ఈ పార్టీ 67 డివిజన్లలో గెలుపొందితే.. ఏ పార్టీ మద్ధతు లేకుండా మేయర్‌ పీఠాన్ని గెలుస్తుంది. 67 కన్నా ఒక్క సీటు తగ్గినా.. టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీల మద్ధతు అవసరం అవుతుంది. స్పష్టమైనా మెజార్టీ రాకపోతే.. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక రసవత్తరంగా సాగడంతోపాటు పంపకాల వ్యవహారం కూడా తెరపైకి వస్తుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడయ్యే అవకావం ఉంది.