Idream media
Idream media
జీహెచ్‌ఎంసీ మేయర్ ఎవరో నేడు తేలనుంది. సంఖ్యాపరంగా బలం ఎక్కువ ఉన్న టీఆర్‌ఎస్‌దే పీఠం అని ఫలితాలు వెలువడిన నాటి నుంచీ తెలుస్తున్న విషయమే. అయితే అనూహ్యంగా బీజేపీ సైతం మేయర్ పీఠానికి సై అంది. దీంతో పోటీ అనివార్యంగా మారనుంది. అయితే బీజేపీ నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అగ్రనాయకులు మరోసారి పరిశీలించి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. అభ్యర్థులను పోటీలో నిలుపుతామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌కు కూడా అభ్యర్థిని పోటీలో నిలబెడతామని చెప్పారు.
ఎవరి బలం ఎంతంటే..
మొత్తం 149 మంది కార్పొరేటర్లు (ఒకరు చనిపోవడంతో), 44 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి గ్రేటర్ కౌన్సిల్ సభ్యులు 193. ఇటీవలి ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన కార్పొరేటర్లతో తొలుత ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మధ్యాహ్న 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ మీటింగ్‌కు 97 మంది హాజరైతే కోరం ఉన్నట్టు భావించి ఎన్నిక ప్రక్రియ కొనసాగిస్తారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. కౌన్సిల్‌లో టీఆర్‌ఎస్ బలం – 88 (కార్పొరేటర్లు 56, ఎక్స్ అఫీషియోలు 32), ఎంఐఎం – 54 ( (కార్పొరేటర్లు 44, ఎక్స్ అఫీషియోలు 10), బీజేపీ బలం 49 (కార్పొరేటర్లు 47, ఎక్స్ అఫీషియోలు 2)గా ఉంది. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది సభ్యుల మద్దతుంటే వారు ఎన్నికవుతారు. ఎటు చూసినా సంఖ్యా బలం చూసుకుంటే బీజేపీ కనీసం రెండో స్థానంలో కూడా లేదు. అయినా పోటీకి సై అంటోంది. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లకు పార్టీ విప్ వర్తించనుండగా.. ఎక్స్‌అఫిషియోలకు విప్ ఉండదు. కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే… ఆ ఓటును పరిగణనలోకి తీసుకుంటూ.. అనంతరం వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. చేతులెత్తే విధానం నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎంఐఎం వైఖరేంటి..?
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బుధవారం నగరానికి చేరుకున్నట్టు సమాచారం. నేడు ఉదయం దారుస్సలాంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన సమావేశం కానున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? తటస్థంగా ఉండాలా..? పార్టీ వైఖరేంటి..? అన్న దానిపై దిశా నిర్దేశం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అయితే ఎంఐఎం పోటీలో ఉంటామన్న సంకేతాలు ఏమీ ఇవ్వలేదు. బీజేపీ కూడా రెండు రోజుల కిందటే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం కూడా తమ అభ్యర్థులను నిలబెడుతుందా..? లేదా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందా..? అనేది చూడాలి.
కేకే కుమార్తె సహా…
టీఆర్ఎస్ మేయర్ రేసులో చాలా మంది పేర్లు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ తనయ విజయారెడ్డి, కనకారెడ్డి కోడలు విజయశాంతిలతో పాటు కవితారెడ్డి, మోతె శ్రీలత, సింధురెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీదేవిల పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. శ్రీదేవి, పూజిత, విజయలక్ష్మి ముందుండే అవకాశం ఉంది. అయితే, ఇందంతా పార్టీలో జరుగుతున్న ప్రచారమే. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఢీకొట్టడం, సమావేశాలు సాఫీగా నిర్వహించడం, ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కోవడం లాంటి సామర్థ్యం అవసరమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో వేరే వ్యక్తిని ఎంపిక చేసి కేసీఆర్ అందరికీ షాక్ ఇచ్చినా ఇవ్వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. కాగా టీఆర్ఎస్ కీలక నేత కేకే కుమార్తె విజయలక్ష్మి బుధవారం టీఆర్ఎస్ భవన్‌కు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు విజయలక్ష్మి. గతంలోనే ఆమెకు మేయర్ పదవి ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చివరిలో బొంతు రామ్మోహన్ ను మేయర్ చేశారు. కేకేకు ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈసారి విజయలక్ష్మి కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా భారీగానే ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో పాటు, జగదీశ్వర్‌గౌడ్, షేక్ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్ తదితర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపిక ప్రక్రియ ఇలా…
– ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది.
– కార్పొరేటర్లు పదవీ ప్రమాణ సీకారం చేస్తారు.
– మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
– 97 మంది సభ్యులు హాజరైతేనే ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. లేని పక్షంలో మరునాటికి సమావేశాన్ని వాయిదా వేస్తారు.
– ఎన్నిక ప్రక్రియలో భాగంగా మేయర్ పదవి కోసం పోటీదారుల పేర్లను ప్రిసైడింగ్ తీసుకుంటారు.
– మేయర్‌గా పోటీ చేసే వ్యక్తి పేరును ఒకరు ప్రతిపాదిస్తే.. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది.
– గుర్తింపు పొందిన పార్టీ నుంచి మేయర్ పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తి సంబంధిత పార్టీ అధ్యక్షుని ధృవీకరణతో కూడిన ఫారం-ఏ, ఫారం-బీ పత్రాలు ప్రిసైడింగ్ అధికారికి సమర్పించాలి.
– ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్న పక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు.
– తెలుగు అక్షర క్రమం ప్రకారం ఒక్కో వ్యక్తి పేరు చెప్పి మద్దతిచ్చేది ఎంత మందన్నది చేతులెత్తే విధానం ద్వారా లెక్కిస్తారు. ఇందుకోసం రో ఆఫీసర్లను నియమించారు.
– సమావేశంలో ఉన్న సభ్యుల్లో (కోరం ఉంటే) ఎక్కువ మంది మద్దతున్న వారిని మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.
– ఇదే తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది.
– కోరం లేక రెండు సార్లు సమావేశం వాయిదా పడిన పక్షంలో ఎన్నికల సంఘానికి ప్రిసైడింగ్ అధికారి నివేదిక పంపుతారు. తర్వాత ఎన్నికల సంఘం ఖరారు చేసిన తేదీన కోరం లేకున్నా.. మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు.