iDreamPost
android-app
ios-app

గెలిచిన కార్పొరేట‌ర్ల‌పై పిటిష‌న్ల మీద పిటిష‌న్లు

గెలిచిన కార్పొరేట‌ర్ల‌పై పిటిష‌న్ల మీద పిటిష‌న్లు

గతేడాది డిసెంబ‌ర్ లోనే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు తేలిపోయాయి. ఈ నెల 11న కార్పొరేట‌ర్లు అంద‌రూ ప్ర‌మాణ స్వీకారానికి కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా మ‌రోవైపు గెలిచినా కానీ కొంద‌రి కార్పొరేట‌ర్ల‌ను ఓడిన అభ్య‌ర్థులు వ‌ద‌ల‌డం లేదు. నాడు పోటీలోనూ.. నేడు కోర్టు ద్వారాను వారిని వెంటాడుతున్నారు. నామినేష‌న్ల స‌మ‌ర్ప‌ణ‌లో వారు అందించిన ప‌త్రాల‌లోను లోటుపాట్ల‌ను లాగి అన‌ర్హ‌త వేటు వేయాలంటూ న్యాయ‌స్థానాల్లో పిటిష‌న్లు వేస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలున్న అభ్యర్థులు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే పది వరకు ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. మరింతమంది పిటిషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరికి మించి సంతానం ఉన్నప్పటికీ తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి పోటీ చేశారంటూ, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ పలువురు విజేతలపై కోర్టుల్లో ఫిర్యాదు చేశారు.

ఎర్రగడ్డ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా గెలిచిన షహీన్‌ బేగానికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆమె పోటీకే అర్హురాలు కాదని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.పల్లవి ఫిర్యాదు చేశారు. ఆమెను ప్రమాణ స్వీకారం చేయకుండా చూడాలన్నారు. హస్తినాపురం డివిజన్‌లో బీజేపీ తరఫున గెలిచిన సుజాత పైనా ముగ్గురు పిల్లలు ఉన్నారంటూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మానాయక్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జాంబాగ్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన రాకేష్‌ జైస్వాల్‌కు ముగ్గురు పిల్లలున్నారని ఎంఐఎం నుంచి పోటీచేసి ఓడిపోయిన జడల రవి పిటిషన్‌ వేశారు. బీఎన్‌ రెడ్డి నగర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి 32 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. రీ కౌంటింగ్‌ చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా అధికారులు బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని ప్రస్తుత కార్పొరేటర్‌, టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

రాంగోపాల్‌పేట డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన అత్తెల్లి అరుణాగౌడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బేగంపేట డివిజన్‌ పరిధిలోని ఓట్లను రాంగోపాల్‌పేట డివిజన్‌లో కలిపారని, ఈ విషయాన్ని ఎన్నికల ముందే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పూర్తి స్థాయిలో పరిష్కరించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజేతల ఎన్నికల అఫిడవిట్లలోని లొసుగుల ఆధారంగా పిటిషన్లు వేస్తున్న ఓడిపోయిన అభ్యర్థులకు వారి సొంత పార్టీలు న్యాయ సహాయం చేస్తున్నాయి. ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాయి. ఈ విషయంలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. గతంలో ఓడిపోయిన అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో చూసుకుందాములే అని వదిలేసే వారని, ఫలితాలు వచ్చాక కూడా పట్టు వదలకుండా న్యాయస్థానాల్లో పోరాడటం కొత్త ట్రెండ్‌గా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఎవ‌రి పిటిష‌న్ల మీద విచార‌ణ పూర్త‌యి తీర్పులు వెలువ‌డ లేదు. ఒక‌వేళ ఏ కార్పొరేట‌ర్ కైనా తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే చ‌ర్చ‌నీయాంశం కానుంది.