గ్రేటర్‌ పీఠం : హంగ్‌ వస్తే..? నిర్ణయాక శక్తులు వారే..!

హోరా హోరీగా సాగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉండడంతో తుది ఫలితాలపై రాజకీయ పార్టీలలోనూ, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. బ్యాలెట్‌ ఓట్లు కావడంతో లెక్కింపునకు సమయం పట్టే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం సహా కాంగ్రెస్‌ కూడా తన శక్తిమేరకు ఈ ఎన్నికల్లో పోరాడాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీలు గ్రేటర్‌పై తమ జెండా ఎగురువేస్తామని ధీమాతో ఉన్నాయి. ఇక మజ్లీస్‌ తనకు బలం ఉన్న స్థానాల్లోనే ఎప్పటిలాగనే పోటీ చేసింది. కమ్యూనిస్టులు కూడా బరిలో ఉన్నారు. 150 డివిజన్లలో 1,123 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

గత ఫలితాలతో సంబంధం లేకుండా గెలుపుపై బీజేపీ, టీఆర్‌ఎస్,ఎంఐఎంలు ధీమాగా ఉన్నాయి. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99, ఎంఐఎం 44 సీట్లు గెలుచుకున్నారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ పీఠం ఒంటరిగా గెలిచింది. ఇక బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ రెండు, టీడీపీ ఒక్క సీటుకు పరిమితం అయ్యాయి. 2009 ఎన్నికల్లో హంగ్‌ రావడంతో కాంగ్రెస్‌ (55), ఎంఐఎం (43) కలసి మేయర్‌ పీఠాన్ని చెరో రెండున్నరేళ్ల చొప్పన పంచుకున్నాయి.

పోయిన ఎన్నికల మాదిరిగా ఏదైనా ఒక పార్టీకి మెజారిటీ వస్తుందా..? లేదా హంగ్‌ ఏర్పడుతుందా..? అనే అంశంపై రాజకీయ పార్టీల నేతలతోపాటు తెలుగు రాష్ట్రాలలోనూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఒక పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలను గెలుచుకోవాలంటే 98 స్థానాలు అవసరం. 150 డివిజన్లు, 45/46 ఎక్స్‌ అఫిసియో సభ్యుల ఓట్లుతో కలపి మొత్తం 196 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సగంపైనా అంటే.. 98 ఓట్లు వచ్చిన వారికి గ్రేటర్‌ పీఠం దక్కుతుంది.

హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌ అఫిసియో సభ్యులుగా 45 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇటీవల నిజమాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉంది. అయితే ఇంకా ఎక్స్‌ అఫిసియో మెంబర్‌గా నమోదు చేసుకోలేదు.

ప్రస్తుతం 45 మంది ఎక్స్‌ అఫిసియో సభ్యులలో 31 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ వారు ఉన్నారు. గ్రేటర్‌ పీఠం గెలుచుకునేందుకు వీరు గాక టీఆర్‌ఎస్‌ ఇంకా 67 డివిజన్లలో గెలిస్తే సరిపోతుంది. ఎంఐఎంకు 10 మంది ఎక్స్‌ అఫిసియో సభ్యులున్నారు. ఈ పార్టీ 88 డివిజన్లలో గెలవాల్సి ఉంటుంది. అయితే ఎంఐఎం 55 డివిజన్లలోనే పోటీ చేసింది. సొంతంగా ఎంఐఎం మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకునే అవకాశమే లేదు. బీజేపీకి ఇద్దరు ఎక్స్‌ అఫిసియో సభ్యులున్నారు. 96 డివిజన్లను గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు కూడా ఇద్దరు ఎక్స్‌ అఫిసియో సభ్యులు ఉన్నారు. ఈ పార్టీ తరఫున కూడా 96 మంది కార్పొరేటర్లు గెలవాలి.

బీజేపీ మేయర్‌ పీఠం చేజిక్కించుకోవాలంటే 96 డివిజన్లు గెలవాలి. మరి బీజేపీ ఈ మార్క్‌ చేరుకుంటుందా..? లేదా..? అనేది రేపు తెలుస్తుంది. 150 డివిజన్లలో ఎంఐఎం ఖచ్చితంగా 40 –45 స్థానాలను గెలుస్తుంది. అవి పోను ఇక 105 –110 స్థానాలు ఉంటాయి. వీటిలోనే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. బీజేపీ మంచి ఫలితాలు సాధించి.. టీఆర్‌ఎస్‌ను 67 స్థానాల కన్నా తక్కువకు నిలువరిస్తే.. అది ఎంఐఎంకు మేలు చేస్తుంది. టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పాలక మండలిని ఏర్పాటు చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మేయర్‌ పీఠాన్ని చెరి రెండున్నరేళ్ల చొప్పున పంచుకునేలా ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కలు, కూడికలు అవసరం లేకుండా గ్రేటర్‌ పాలక మండలి ఏర్పాటవుతుందా..? లేదా..? రేపు సాయంత్రానికి తేలుతుంది.

Show comments