iDreamPost
android-app
ios-app

స్పందించ‌క‌పోతే మూడేళ్ల పాటు ఆ నేత‌ల‌పై వేటే..? ఈసీ హెచ్చ‌రిక‌

స్పందించ‌క‌పోతే మూడేళ్ల పాటు ఆ నేత‌ల‌పై వేటే..? ఈసీ హెచ్చ‌రిక‌

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల దాటింది. ఆ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అభ్య‌ర్థులంద‌రూ కోట్లాది రూపాయ‌లు కుమ్మ‌రించారు. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల్లో కొంద‌రు సుమారు 2 కోట్ల నుంచి ప‌ది కోట్ల వ‌ర‌కు కూడా ఖ‌ర్చు పెట్టిన వారు ఉన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థి 7 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాడ‌ట‌. తీరా అత‌ను ఓడిపోయాడు. దీంతో ఆదుకోవాల‌ని, పార్టీ ఫండ్ ఎంతో కొంత ఇప్పించాల‌ని కోరుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌ధాన పార్టీ ఇన్ చార్జిగా ఓ నాయ‌కుడు త‌న పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం సొంత డ‌బ్బే 30 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీలో భ‌విష్య‌త్ కోసం ఇలా చేశాడ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఒక్కో అభ్య‌ర్థి వ్య‌య ప‌రిమితి రూ. 5 ల‌క్ష‌లు మాత్ర‌మే. కానీ కేవ‌లం ఓ బ‌స్తీ కోస‌మే ఒక్కో అభ్య‌ర్థి అంత ఖ‌ర్చు పెట్టాడు. మ‌రి ఇప్పుడు నిబంధ‌న‌ల ప్ర‌కారం 5 ల‌క్ష‌ల ఓపు చూప‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. దీంతో అత్య‌ధిక మంది ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఇప్ప‌టికీ లెక్క‌లు చూప‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈసీ ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. వారికి డెడ్ లైన్ విధించింది.

నిబంధనల ప్రకారం ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో ఖర్చుల వివరాలు సమర్పించాలి. లేని పక్షంలో ఎన్నికల సంఘం వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. గెలిచిన వారిని పదవుల నుంచి తొలగించనుండగా.. ఓడిపోయిన వారు మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటిచేసే అవకాశం ఉండదు. డిసెంబర్‌ 1వ తేదీన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగగా.. 150 వార్డుల నుంచి 1122 మంది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, ఎంఐఎం, టీజేఎస్‌, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలతోపాటు స్వతంత్రులు పోటి చేశారు. 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో వివరాలు సమర్పించాలి. ఇందుకు ఈ నెల 17వ తేదీ వరకు గడువు ఉంది. ఆలస్యంగా ఫలితం వెలువడిన నేపథ్యంలో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో పోటి చేసిన అభ్యర్థులు మాత్రం 22వ తేదీ వరకు వివరాలు సమర్పించే అవకాశముంది. ఇప్పటి వరకు కనీసం 25 శాతం మంది కూడా వివరాలు ఇవ్వలేదని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. విజేతలుగా నిలిచిన వారిలో కూడా కొందరు ఇంకా ఖర్చు లెక్కలు సమర్పించలేదని ఓ అధికారి చెప్పారు.

వ్యయ పరిమితి… రూ.5 లక్షలు…

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. నిర్ణీత ధరల ప్రకారం వారు ప్రచారంలో వాడిన సామాగ్రీ, మైకులు, ఇతరత్రా వ్యయానికి సంబంధించి వివరాలు సమర్పించాలి. ఇందుకోసం చాలా మంది ఆడిటర్ల సేవలు పొందుతారు. జీహెచ్‌ఎంసీ చట్టం 1955, సెక్షన్‌ 617 (బీ1) ప్రకారం ఎన్నికల్లో పోటిచేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి.. నామినేషన్‌ నుంచి ఫలితాల వెల్లడి వరకు చేసే ఖర్చుకు డబ్బులను ఆ ఖాతా నుంచే వినియోగించుకోవాలి. ఎంత మంది అభ్యర్థులు వ్యయ వివరాలు అందజేశారు..? ఇంకా ఎంత మంది ఇవ్వాల్సి ఉంది..? అన్న దానిపై ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీని ఆరా తీస్తోంది. ఈ విషయంపై 8వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. పోటి చేసిన వారెందరు..? వివరాలు సమర్పించినది ఎందరు..? అన్న దానిపై సమావేశం రోజున స్పష్టత వస్తుందని అధికారులు చెబుతు న్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వివరాలు సమర్పించని వేలాది మంది సర్పంచ్‌లు, వార్డు సభ్యులపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. విజేతలుగా నిలిచి.. వివరాలు ఇవ్వని వారిని పదవి నుంచి తొలగిస్తున్నారు. ఆయా గ్రామాలు, వార్డులకు మళ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంపైనా ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఓడిపోయి వివరాలు సమర్పించకుంటే వచ్చే మూడేళ్లు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. పదవులు కోల్పోయిన వారు కూడా మూడేళ్లపాటు పోగా చేసే అవకాశం ఉండదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీ వరకు ఎన్నికల ఖర్చు సమర్పించని పక్షంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.