Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కొలిక్కివస్తోంది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ అవసరం లేకుండానే మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది. కనీసం సగం మంది సభ్యులు హాజరవ్వాలన్న కోరం నిబంధనతో చేతులెత్తే పద్ధతిలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. డివిజన్‌లకు ప్రత్యక్షంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఈ ఎన్నికలకు ఓటు హక్కు కలిగి ఉంటారని తెలిపింది. మొదటి సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అవుతుందని చెప్పింది. మొత్తం సభ్యుల్లో కనీసం సగంమంది హాజరైతే కోరం ఉన్నట్లు పరిగణించి, సమావేశాన్ని కొనసాగించి మేయర్ ఎన్నికను నిర్వహిస్తామని, మేయర్ ఎన్నిక జరిగితేనే డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుందని పేర్కొంది. ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో మెజారిటీ, మేజిక్ ఫిగర్‌పై జరుగుతున్న చర్చలకు, అనుమానాలకు తెరదించినట్లయింది.
ఒకటి కంటే ఎక్కువ నామినేషన్‌లు వస్తే…
మొదటి సమావేశంలో కోరం లేకపోవడమో, మరే ఇతర కారణాల వల్లో ఎన్నిక నిలిచిపోతే… మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండవ రోజు కూడా సమావేశం వాయిదా వేయాల్సి వస్తే తదుపరి సమావేశ తేదీని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. మూడో సమావేశంలో కోరంతో సంబంధం లేకుండా హాజరైన సభ్యులతోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కూడా రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. ఒకటే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవమని ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మంది నామినేషన్‌ను దాఖలు చేస్తే చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్‌ను జారీ చేసుకోవచ్చు. విప్ ధిక్కరించి ఓటేస్తే ఓటు చెల్లుబాటు అవుతుంది. అయితే, విప్ ధిక్కరణపై అందిన ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి నోటీసును జారీ చేస్తారు. వివరణ ఇవ్వాలి. వివరణపై సంతృప్తి చెందని పక్షంలో సదరు సభ్యుడిపై చర్యలు తీసుకుంటారు. ఒక్కో సారి పదవీగండం తప్పదు.
టీఆర్‌ఎస్‌కే చాన్స్..?
గ్రేటర్‌లో 150 డివిజన్‌లున్నాయి. ఇందులో టీఆర్‌ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కార్పొరేటర్ల బలాలను కలిగి ఉన్నాయి. మొదటి సమావేశం నాటికి ఎక్స్ అఫిషియో సభ్యుల బలం తేలనుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌కు కనీసం 35 మంది, ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. టీఆర్‌ఎస్‌కే బలం ఎక్కువ ఉండడం వల్ల దాదాపు ఆ పార్టీకే మేయర్ దక్కుతుంది. మరోవైపు ఎంఐఎంను సంప్రదించే అవసరం కూడా లేదు. దీంతో మేయర్ ఎలా అని ఇప్పటి వరకూ సతమతమైన ఆ పార్టీ వర్గాలకు ఉపశమనం లభించినట్లే.